ఈ పుట ఆమోదించబడ్డది

ఇ త ర ది నా లు

61

‘ఔనురా! ప్రేమోదయమైన తర్వాత వివాహం చేసుకోగానే యూరపియను దాంపత్యంకంటె, మన దాంపత్యాలే ప్రేమసౌఖ్యాల కెక్కువ నిలయంగా వుంటవి. ఎవరిమాటో ఎందుకు? వివాహం నాటికి నేను వయసువచ్చిన వాణ్ణే అయినా వివాహాత్పూర్వం నేను నా భార్యను చూచుకోలేదు. అదివరకెంతోమంది బాలికలను నాకు యిస్తామని వచ్చినారు. సరే అని నేను చూచుకోడానికి వెళ్ళేవాణ్ణి. చూడగా చూడగా ఒక అమ్మాయి నాకు నచ్చింది. ఆపిల్ల చక్కని చుక్క. ఆ రూపసంపద అలౌకికమనుకో. అందం సంగతలా వుండగా ఆ పిల్ల సంగీతం పాడింది. ఓరీ! రాలు కరిగిపోయి నాకు కన్నులనీరు తిరిగిందంటేనమ్ము. ఈ అమ్మాయి నా భార్యఐతే నాజన్మం సార్థకం అవుతుందనుకొన్నా. తీరా వారు కట్నం తక్కువ ఇస్తామన్నారు. మా తండ్రి గారు ఎక్కువ ఇమ్మన్నారు. దానితో అది చెడిపోయింది. నేను మా అమ్మ చేత, మా నాన్నగారి స్నేహితుల చేత మా నాన్నగారికి చెప్పించినా లాభం లేకపోయింది, నా గుండె ముక్కలయింది. నేను నిర్మించుకొన్న ఆనందధామం కుప్పగూలిపోయింది. తర్వాత వచ్చిన సంబంధాలలో ఇంకో పిల్లకూడా ఆ అమ్మాయి అంత అందం కాదుగాని మొత్తంమీద చక్కదనం, సంగీతం అదీ వున్న పిల్లే. వాళ్లు గొప్ప సంబంధంకోసం వల పన్నుకొని, ఆ చేప వలలో పడితే మాసంబంధం వదలివేద్దామనీ, లేకపోతే, రెండోరకం క్రింద మాబేరానికి వద్దామనీ అనుకున్నారు. ఆ పిల్ల నా గుండెలో రాగాలు పాడింది. నా నేత్రాలు నిమీలితాలయ్యాయి. కాని వారి కా సంబంధందొరికింది. నా కా బాలిక దూరమయింది. ఆ దెబ్బతో నేనింక ఏ పెళ్ళికూతుర్నీ చూడనని ఒట్టు పెట్టుకున్నా. చివరకు చూడకుండానే సంబంధము నిశ్చయ మయింది. మంగళసూత్రం కట్టేటప్పుడు పిల్ల అంత బాగుండలేదని గ్రహించి చిన్నబుచ్చుకున్నాను. ఆనాటి యిద్దరు బాలికలూ అప్పుడు జ్ఞాపకం వచ్చారు. నిట్టూర్పు వదిలా. కాని ఒరే నువ్వు చెప్పినట్లు మంగళసూత్రధారణంలో ఏమిమహిమ వుందో, అది మొదలు నాభార్య అంటే పరమప్రేమ జనించింది రా!’

పరమేశ్వరుడు చెమరించే కన్నులతో నారాయణుని కనుగొని అతనివీపు నిమిరినాడు, నారాయణుడు విషయం మార్చుటకు నుద్దేశించి ‘మన పెళ్ళిళ్ళకు, మహమ్మదీయుల వివాహాలకు చాలా తేడావుంది రా!’ అని నాడు.

‘మహమ్మదీయుల వివాహాలు మత సంబంధం ఏమీ లేని కంట్రాక్టులు కావడం చేతనేమో, వాటిని రద్దు చేసుకోడం సులభంగా భావిస్తారు మహమ్మదీయ సోదరులు.’

‘అవును. మహమ్మదీయ వివాహం సంపూర్ణంగా కంట్రాక్టు. క్రిస్టియను చర్చి పెళ్ళి సగము మత సంబంధం. మన సంఘంలో మాత్రం వివాహం పూర్తిగా ధర్మసాధనమైన కర్మ. స్త్రీ, పురుష సంబంధం ఇంత పవిత్రం కావడానికి యెన్ని యుగాలు పట్టిందో! మానవుడు వట్టిజంతువులా, ఆ అతిపురాతన కాలంలో