ఈ పుట ఆమోదించబడ్డది

58

నా రా య ణ రా వు


జానకమ్మ: అందుకోసమే ఈ సంబంధము మా వారికి ఇష్టము లేకపోయింది. మెడలువంచి వొప్పించినారు.

వెంకాయమ్మ (నారాయణరావు అక్కగారు, శ్రీరామమూర్తి చెల్లెలు): అమ్మా, అదేమిటే అల్లాంటావు! నిక్షేపంవంటి సంబంధము. తమ్ముడికి మరదలంటే చాలా ఆపేక్ష. కోరుకొని చేసుకొన్న పెళ్ళికూతురాయెను.

సత్యవతి: (నారాయణ రావు రెండవ అక్కగారు) అక్కయ్యా! భార్యాభర్తలకు మనస్సు కుదిరిన సంబంధము చేసుకోవాలి. లేకపోతే వాళ్ళిద్దరి బ్రతుకూ యమలోకము.

వెంకాయమ్మ: నా తల్లీ, నీ ఖర్మం అల్లా కాలిపోయింది కాని, అన్ని సంబంధాలు భార్యాభర్తల ఇష్టంమీదే చేస్తున్నారటే?

జానకమ్మ: మగవాడు గౌరవముచేయని ఆడదాని బ్రతుకు అధమాధమం. డబ్బక్కర లేదు, పిల్లలక్కర్లేదు! మొగుడు ఆడదికూడా ఒక ప్రాణి అని తలపే లేక కుక్కకన్నా కనాకష్టంగా చూస్తే దానిబతుకు పేడలో దొర్లే పురుగుకైనా వద్దు.

సత్యవతి భర్త పరమకోపి; వట్టి అనుమానపుమనసువాడు. తన నీడను చూచి తాను భ్రమిసే పిచ్చిమనిషి. ఏదో వంక మీద భార్యను చావకొట్టును. బావగారితో మాట్లాడినావనును. మరిదివంక జూచినావనును. ఒక రోజంతయు తిండి పెట్టవద్దని తన తల్లికి నాజ్ఞ యిడి, గదిలో బెట్టి తాళము వేసినాడు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలకుడు, ఒక బాలిక చిన్నతనములో నే జబ్బులుచేసి పోయినారు. పెద్దపిల్ల పదేళ్ళది. సత్యవతి స్ఫురద్రూపి, తీర్చిన కనుముక్కు సొబగుగల బంగారుశలాక వంటిది. వెన్నెలకిరణము, అందకత్తె యయిన భార్యను జూచినప్పుడు వీరభద్రరావు, వీరభద్రుడై నిష్కారణముగ జావగొట్టును. సుబ్బారాయుడుగారికి జానకమ్మ గారికి సత్యవతి చరిత్ర సంతతము మహావిషాదము కలుగ జేయుచుండును. వారి జీవితయానములో సత్యవతీ చరిత్రయే నీటిక్రింద నణగియున్న భయంకరమగు శిలయైనది. పుత్రిక కొరకై జానకమ్మగా రెన్ని గంగాయమునా ప్రవాహములు కన్నుల బ్రవహింపజేసినదో!

సూర్యకాంతము: (నారాయణ రావు రెండవ చెల్లెలు) అక్కయ్యోయి! నేనూ చిట్టక్కయ్యా చిన్న వదినదగ్గర ఉన్నాము నిన్నల్లాను. మొట్టమొదట ఏమి మాట్లాడింది కాదే! మేమే తెగ పలకరించాము. అప్పుడు మాట్లాడిందే. తన చదువుసంగతులు, సంగీతం సంగతి, వాళ్ళచుట్టాల సంగతి అన్నీ చెప్పింది. మా యిద్దరికీ స్నేహం కలిసిపోయింది.

రమణమ్మ: (నారాయణ రావు పెద్ద చెల్లెలు) ఒసేవు అక్కయ్యా, నాతో రెండు మాటలేవో చెప్పింది. అంతే. సూరీడుతో ఒకటే కబుర్లు. వాళ్ళిద్దరికీ ప్రాణ స్నేహం కలిసిపోయింది.