ఈ పుట ఆమోదించబడ్డది

ము చ్చ ట్లు

55

సమస్త జనులకు నెచ్చట నేమియు కొఱత రాకుండ జమీందారుగారు వేయి కనులతో గనిపెట్టియుండిరి.

నాల్గవనాటి రాత్రి పట్టణమంతయు నూరేగింపుటుత్సవము మహావైభవముగ జరిగినది.

జమీందారుగారి ఊరేగింపు టేనుగుపై బంగారపుటంబారీ నమర్చి వధూవరుల నం దాసీనులజేసి యూరేగించినారు. అలంకృతములగు నాలుగు మదగజములు, ఒంటెలు, ఒయ్యారపునడకల తురగములు నాలుగు రణడోలు మేళములు, మైసూరుబ్యాండు, నౌబత్తు మేళములు, మోటారుకార్లు, చిత్ర విచిత్రములగు వేషములు, ఓడలు, బండ్లు మొదలగు వాహనములు, నయిదు వందల గ్యాసుదీపాలు, కొబ్బరికురిడీ దివ్విటీలు రెండువందలు, పూలచెట్లు, కాగితపుబుడ్ల దీపాల వరుసలతో, అఖండ వైభవముతో గనులపండువుగ నూరేగింపుటుత్సవము నడచినది. ఊరంతయు నూరేగింపులో నున్నది. మగపెండ్లి వారందరు మోటారుబండ్లమీద నూరేగిరి. ఆడపెండ్లివా రెవ్వరును రాలేదు.

వివాహమునకు నారాయణరావు స్నేహితులందఱు నరుదెంచిరి. చాల మందికి రాకపోకలకు ఖర్చులు నారాయణరావు పంపినాడు. ఆ యువకమండలి యంతయు పేకాటలతో, సిగరెట్ల కాల్పులతో, వివిధ వాదములతో, నవ్య కవిత్వపు సభలతో, బెండ్లి యైదుదినములు వినోదించిరి. జమీందారుగారు వారి విషయమై యపరిమిత శ్రద్ధవహించి, వారి కెప్పు డేమి కావలయునో అరయుచుండుటలో, సిగరెట్లడబ్బా అందుబాటు చేయుటలో నేమరకయుండెను. నారాయణరావు తనమిత్రుల యవసరములకని పరమేశ్వరమూర్తి చేతిలోనిడిన నూరురూకలతో బనిలేకపోయినది. రాజారావు, పరమేశ్వరుడు, ఆలం, ఇంకను చాలామంది ఆంతరంగిక మిత్రులు కుటుంబములతో వచ్చిరి. స్నేహమండలికి వలయు సౌకర్యము లొనగూర్చుపని లక్ష్మీపతి వహించవలసి వచ్చినది. లక్ష్మీపతి యతిశ్రద్ధాళువై స్నేహబృందముచే లోటేమియు లేదనిపించినాడు.

ప్రాణస్నేహితులు, కొంచెము దూరపుమిత్రులు, మరీ దూరపుహితులు, లోనగువారికి నారాయణరాయ లక్ష్మీపతులు దలలోని నాలుకవలె మెలంగిరి.

ఒక స్నేహితుడు: పెండ్లికూతురు అప్సరసవలె వుందిరా!

ఇంకొకడు: చాలా తెలివైన అమ్మాయటరా! ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు క్షుణ్ణంగా వచ్చునట. ఫిడేలు, వీణపాటల్లో అపరశారదాదేవే అన్నారు.

రాజా: అది గాదోయి, నారాయణరావు అదృష్టవంతుడని అనవచ్చు నన్నమాట.

పర: చాలా అదృష్టవంతుడని ఈ సభలో ఉపపాదన చేస్తున్నాను, సభవారు ఆమోదిస్తే ప్రకటనార్థము పత్రికలకు పంపుతాను.