ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నవాడు

47


నారాయణరావు మొదటి ఫారము చదువుచుండగా నైరోపీయ మహాసంగ్రామము ప్రచండోష్ణవాయువువలె విశ్వమెల్ల వీవదొడంగెను. నారాయణరావు లేత హృదయమున నాంగ్లేయుల పైనపుడు జాలిపొడమినది. ‘ఈనాడు వారికి రాజ్యవినాశము సంభవించి విపత్తు వచ్చినది. పాపము తెల్లవారి బాలకులెందరో తండ్రులులేని బాలకులైపోదురు. కాన, వారికి మనమంతా సహాయం చేయాలి’ అని వాదించాడు తోడిబాలురతో. సరేయన్నారు వారు. చందాలు వసూలు చేసి, తాను తల్లిగారినడిగి పదిరూపాయలు చందావేసి, మొత్తము పదునేను రూకలు పెద్దకలెక్టరుగారు కొత్తపేట మకాము వేసినప్పుడు నిర్భయముగా వారిని దర్శించి ‘యుద్ధమునకు మా బాలకుల చందా’ యని సమర్పించినాడు. ఆ యాంగ్లోద్యోగి ఆశ్చర్యపూరితహృదయుడై ఈ నూలుపోగు వేయి మడుంగులు శక్తి గల త్రాడగుననియు, ప్రభుత్వము వారి తరఫున నా చిన్నబాలకునకు ననేక నమస్కారము లర్పించుచున్నాననియు, నాంగ్ల సామ్రాజ్యమున కానాడు సంభవించిన యాపత్తునకు భారతదేశము చూపు రాజభక్తి, యనన్యసామాన్య మనియు, నట్టిభక్తికి నీ బాలకుడే నిదర్శనమనియు నిండుసభలో నుపన్యసించుచు, తనకడనున్న లాంబ్ కవి శేఖరుని ‘ఎలియా’ వ్యాసముల గ్రంథము నారాయణరావునకు బహూకరించెను.

నారాయణరా వీయాలోచనలు తన్నలమికొన, హాయిగా నిదురగూర్కు లక్ష్మీపతిని గమనించి, యేల యిట్లీతనికి సుఖనిద్ర పట్టెనని యాశ్చర్యము జెందినాడు. ఒకరికి గష్టమగు విషయ మింకొకరిని రవంతైన చలింపజేయదు. ఒక్కరిని సంతోషసముద్రమున నోలలాడించువిషయమే వేరొకరిని దుఃఖజలధిని ముంచును. ఏ సందర్భములోనైన హృదయ మావంతయు జెదరనీయని తాను, రామచంద్రరాయని ప్రయాణముచే నిట్లు కలత జెందుచుండ, లక్ష్మీపతి, తన మరదలిభర్త యిట్లు దేశములు తెగించిపోవుట కించుకైన జలింపక, గాటముగా నిదురించుచుండుట గాంచి, సృష్టిలో నొక్కొక్కరి ప్రకృతి యొక్కొక రీతి నుండునుకదా యని నారాయణరా వనుకొనెను. లక్ష్మీపతిని లేపుదామాయని యాతనికి గోర్కె జనించినది. కాని వెంటనే మరల్చుకొని నాడు. వివిధములగు రంగులతో, విచిత్రములగు కలయికలతో మేళవింపై నిగూఢార్థపూరితమగు మానవజీవిత మంతయు జక్కని చిత్రలేఖనమేయని యాత డనుకొన్నాడు.

కావుననే, ప్రకృతిని ప్రాతిపదికగా, నాధారభూతముగ నొనర్చుకొని కళాసృష్టి చేయవలసివచ్చినది. ప్రకృతి ననుసరించుటయు నొక కళాసాంప్రదాయమగుట సంభవించినదని, యాత డూహించుకొన్నాడు. సర్వదా మన కనులయెదుట నుండి, మనకు జిరపరిచితములగు వస్తువులే ఛాయాచిత్రమగుట తోడనే ఆనందము సమకూర్చుచున్న వని యాతడనుకొనెను.

ప్రక్కయంతయు జల్లబడిపోయి హాయిగ జల్లగాలి వీచుచున్నను, నారాయణరావు తనకు నిదుర పట్టుట లేదని వితర్కించుకొని నాడు. నిదురబోవునపుడు మనఃప్రవృత్తులడగిపోవునా? ఆతురతవలననో, యే గాఢాలోచనా తీవ్రత