ఈ పుట ఆమోదించబడ్డది

రా య బా రం

39

నేమున్నది తరవాయి? మంచిరోజుచూచి మనవాళ్లు రాజమండ్రికి ముహూర్త నిశ్చయంకొరకు వెళ్లిరమ్మని సెలవాండి’ అనియెను.

శ్రీనివాసరావుగా రంతట ‘మరేమిటంటే, మళ్లా యెప్పుడో చూడడ మెందుకు? ఉండవలసిన సిద్ధాంతు లందరు ఇక్కడనే ఉన్నారుగా విచారించండి ‘శుభస్య శీఘ్ర’ మ్మన్నారు. మొన్న నారాయణరావు గారు రాజమండ్రి వచ్చినప్పుడు, నేను పుట్టిన తారీఖు అడిగితే, పెట్టెలోంచి, మరేమిటంటే, జాతక చక్రం తీసియిచ్చారు. జాతకం చాలా బాగుందన్నాడు మా సిద్ధాంతి గారు. అమ్మాయి జాతకానికి కూడా చాలా బాగా సరిపోయిందన్నాడు. రెండు జాతకాల్ని బట్టి ముహూర్తం రహితం చేయించడం ఉత్తమం. ఏమండీ సిద్ధాంతి గారూ!

సిద్ధాంతి: చిత్తం! అది తమతో మనవి చేయకుండా నేను చూశానండి. రేపు వైశాఖమాసంలోనే ఉంది, సర్వోత్కృష్ట మైన ముహూర్తం. సప్తమ శుద్ధి, గురుశుక్రబలం బాగుంది. కుజుడు ఏవిధంగానున్నూ దోషకారిగా లేడు; అన్ని బలాలు బాగున్నాయండి! చాలా జయప్రదంగా వివాహం జరుగుతుంది. దాంపత్యం దివ్యంగా ఉంటుంది.

ఆనంద: తమది పెద్దపూర్ణయ్య గారి మతమా, చిన్న పూర్ణయ్యగారి మతమా అండి?

సిద్ధాంతి: అయ్యా ! నేనుమాత్రం చిన్న పూర్ణయ్య గారిని పూర్తిగా అనుసరిస్తాను. ఏమంటారా, శాస్త్రంలో ఏమన్నా దృక్సిద్ధం లేక పోతే నిజమైన ఉపయోగం లేదండి.

మృత్యుంజయ రావను నొక రాజమహేంద్రవరపు న్యాయవాది: అయ్యా దృక్సిద్ధం అనేది పాశ్చాత్యులు దూరదర్శినీయంత్రాలు చూసి వ్రాసిన వ్రాతల్ని బట్టేకదా! ఇప్పటి కింకా ‘హైపీరియా’ నని ‘ప్లూటో’ అనీ కొత్త కొత్త గ్రహాల్ని కని పెట్టుతున్నామంటారు. కొన్ని కొన్ని మార్పులకు శాస్త్రీయమైన జవాబు కన్పించదాయెను. మనవాళ్లు, అంటే మహాఋషులు అతీంద్రియ దృష్టితో చూచి ఏర్పరచిన లెక్కలన్నీ మార్చి, ఇప్పుడు దృక్సిద్ధాంతం కావాలి అంటారు. చివరికి ఈ దృక్సిద్ధాంతం నిలవకుండా ఎగిరిపోయేరోజు వచ్చిందాకా ఈ సిద్ధాంతాన్ని విడవరు కాబోలు.

తహసీల్: అదికాదండి. నేనూ కాస్త ఈమధ్య జ్యోతిషం నేర్చుకోవడం ప్రారంభించాను. మనవాళ్లు ఏర్పరచిన లెక్కలున్నాయి చూశారూ, దృక్సిద్దాంతం రూపకంగా సరిచూడమనే సెలవిచ్చారు. అల్లా చేయకుండా ఆచారం అనీ సంప్రదాయం. ఆ మాటలకు నిజమైన అర్థం గ్రహించకుండా ఒకటే పంథా, మరీ గుడ్డెద్దు చేనిలో బడ్డట్టు.

మృత్యుం: చిత్తం. తమరు సెలవిచ్చినది నిజమే మరి. కాలాన్ని బట్టి మనం ఆకాశపటంలో ఏమి గమనించాలో, భూమిమీద వాటినిబట్టి ఏమి