ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

నారాయణరావు

క్విన్ ఇచ్చి, నీలరక్తధమనిలోనుండి క్వినయిను మందు పొడిచి ఇచ్చినాడు మూడుసార్లు. బలమునకు వరదకామేశ్వరీదేవికి తెలియకుండ కోడిగుడ్లలోని తెల్లసొన చిలకరించి బత్తాయిరసములో ద్రాక్షరసము పంచదార కలిపి యిప్పించినాడు. నాలుగురోజులయిన వెనుక జ్వరము తగ్గిపోయినది. రాజారావు తగు సలహాలు, మందులు చెప్పి యమలాపురము వెళ్ళిపోవ సిద్ధమై, జబ్బు నిమ్మదించిన రెండురోజులకు పథ్యము పెట్టించి వెళ్ళిపోయినాడు.

పరిచారిక లెందరున్నను, బీదచుట్టములు చాకిరి చేయువా రెందరున్నను, రేయింబవళ్ళు అత్తగారి మంచముకడ కూర్చుండి మందులిచ్చియు, నాహార మిచ్చియు జ్వరాంశాలు చూచి వ్రాసికొనియు, శుశ్రూష చేసినాడు నారాయణరావు. అతని చేయి తనతలపై పడినప్పడు వరదకామేశ్వరికి ప్రాణము లేచివచ్చి హాయిగ నిద్దురపట్టినది. అతనిమాట ఆమెకు జోలపాట అయినది. అత డెదురుగ కూర్చుండియుండ పథ్యము వంటపట్టినది.

జ్వరతీవ్రతలో ఒడలు తెలియక పడియున్నప్పుడు వెనుకటి నారాయణరావును తిట్టినది. జగన్మోహనుని పొగడినది. శారద నెత్తుకొనిపోయిన రాక్షసుడని వచించినది. నారాయణరావు నవ్వుకొనుచు ‘ఇదియా రహస్య’ మనుకొని యాశ్చర్యపూరితుడగుచు, నెమ్మదిగ యూడికొలోనులో గుడ్డలు తడిపి నుదుటిపై వేయువాడు.

ఆనాటి అల్లుడు వేఱు, ఈ నాటీ అల్లుడు వేఱా! అని కనులు విప్పి వరదకామేశ్వరి ఆశ్చర్యమున మునిగి యల్లునిజూచి యానందించినది. అతడు దగ్గరలేనపుడు జ్వరపు నిద్దురలో నుండి మెలకువ వచ్చినచో ‘నారాయణరావు!’ అని నెమ్మదిగ బిలుచునది.

ఒకనాడు జమీందారు గారు భార్యకడ కూర్చున్నారు. ఆమెకు నూట అయిదంశముల జ్వరము వచ్చినది. ఒడలు పేలిపోవుచున్నది. జమీందారుగారు హృదయమున భయముతో భార్య మంచముపై గూర్చుండినారు. రాజారావు ‘ఏమి ఫరవాలేదండీ’ యన్నాడు. మామగారికి ధైర్యము చెప్పి నారాయణరావు భోజనమునకు బోయినాడు.

ఒడలు తెలియక పరుండియున్న వరదకామేశ్వరీదేవి కనులు తెరచి, భర్తను జూచి, ‘అల్లుణ్ణి పిలవండి’ అన్నది. జమీందారుగారు చకితులై, కన్నుల జలము స్రవింప నవనతవదను డయ్యెను.

ఇదివరకు నారాయణరావును అల్లుడని చెప్పుకొన్నది లేదు. ఈ నాటికి, ఈమె బాగుపడి పదిమందిలో మరల నడచునా?

రాజారా వది గ్రహించి ‘అయ్యా! ఇంతకన్న ఇక ఎక్కువరాదు. ఇంతకూడా ఇక రానేరాదు. ఇంక వారంరోజులలోపల ఆమెకు పూర్ణముగా నెమ్మదిస్తుందండి. మలేరియాయే. పోనీ రక్తము పరీక్ష చేద్దామంటే, ఇప్పడు క్వయినా యిచ్చుటవల్ల వీల్లేదు.’