384
నారాయణరావు
నారాయణరావు, రాజారావు, సుబ్బారాయుడుగారు, జానకమ్మగారు కొత్తపేట వెళ్ళినారు. దారిపొడవున నారాయణరావు ఏదియో యాలోచించుచునేయుండెను. రామచంద్రరావు ఇంటికి వచ్చినాడు. ముద్దుచెల్లెలగు సూర్యకాంతము భర్తను గలసికొనును. ఇక చెన్నపురిలో తానొక్కడు గాపురముండవలయును. కొత్తపేట వెళ్ళినపిమ్మట తన మదరాసు కాపురము సంగతి ఎట్లు తేల్చుకొనుట. శారదాదేవి తన ప్రియురాలై ప్రణయదేవతయగు సూచనలు ఎండమావులా? ఆమె హృదయము కరిగినదను సూచనలు తోచుచున్నవి. తన భావిస్థితి యెట్టిది? ఈ బ్రతుకుదారి ప్రయాణము ‘ఒంటరిగా ఉయ్యాల లూగుట’ యగునా? పూజించుటకైన, ఆ పరిమళము వహించని తన బ్రతుకుపూవు పరమ ప్రభున కంకితమియుటకైన తగునా?
ఒకసారి మనసార శారద దనతో మాటలాడినదా? కవోష్టమును, పరిమళపూరితము, నద్భుతానంద పూర్ణమును, సర్వసౌందర్యనిధియు నగు నా బాలికామూర్తి తన మెడచుట్టు బిగియార బాహువులు బిగించి, స్వప్నాల నీదులాడు ఆ వెడద నయనాలతో తన కన్నులలోనికి తనివోవ చొచ్చిచూచి, మాధురీ సర్వస్వములు సుడివోవు గులాబి మొగ్గలు, ఉభయసంధ్యారుణాలైన ఆ పెదవులతో తమివోవ, జన్మలు కరిగిపోవ ముద్దిడి తన దివ్యప్రణయినియై తన్ను చేరుట ఈ జన్మమునందున్నదో లేదో?
ఆనాడు జరిగిన మహాపరాభవము తన్ను దహించివైవనీక, తన్ను దుర్గమ హిమాలయ శీత శిఖరాలకు తరుమనీక, తన ప్రాణాల చిదిమివేయనీక, యేదియో యాశ ఈ నాటక మాడించుచున్నది. ఎంత కాలము దేవీ! జన్మరజ్జువునకు ఆఖరి సూత్రములు తెగువరకు నీ విటులుండుట?
ఇంటికి వచ్చునప్పటికి శ్యామసుందరి యుత్తరము వచ్చినది.
‘అన్నా! గంటలకొలది తరచి, తరచి యాలోచించితిని. ఇందులో అపారమైన ఈశుని కరుణజూచాను. నీవా ఈశుని వాక్కువు. నేను నీ యాజ్ఞకు బద్ధురాలను. నేను మీ స్నేహితుని ప్రేమించి ఎరుగను. నిన్ను మాత్రము నా ప్రియ సహోదరునిగా ప్రేమించి ఎరుగుదును. అయినను డాక్టరుగారు పూజ్యతములగు మహాపురుషులు. వారి సేవచేయుచు నా సర్వము వారి కర్పించుటకు నేను సిద్ధపడియున్నాను.
నీ ప్రియమగు చెల్లెలు,
శ్యామ’
నారాయణరా వానందపరవశుడైనాడు. ఇంక రాజారావును ఒప్పింపవలయును.
ఆ సాయంకాలము ఒంటిగా రాజారావును తోటలోనికి తీసికొని పోయినాడు.