ఈ పుట ఆమోదించబడ్డది

374

నారాయణరావు

బోవచ్చుననియు పోలీసు ముఖ్యాధికారితో నీ విషయమై మాట్లాడుట మంచిదనియు తలచి, తన న్యాయవాది గురువు గారికడకు బోయి యంతయు జెప్పెను. వారును నారాయణరావును గలసి రాజధాని పోలీసు ముఖ్యాధికారి కార్యాలయమునకు జని యచ్చట విచారించగా, రామచంద్రరావు విషయమై యేదియో గూఢసమాచారమును, అందునకు సంబంధించిన కాగితములును ముఖ్యాధికారికి అందినట్లును, ఆయనే రామచంద్రరావును బంధింప నుత్తర్వులిచ్చినట్లు, ఇది యంతయు ప్రాణకాంతబోసు, గండారుసింగులపై ప్రభుత్వమువారు తెచ్చిన యభియోగమునకు సంబంధించినదనియు దెలిసినది.

దానితో నారాయణరావు తిన్నగ నీలగిరికి, కూనూరు పోయినాడు. మామగారితో మాట్లాడినాడు. మామగారిని దీసికొని ఉదకమండలము వెళ్ళినాడు. జమీందారుగారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనతో గలసి, పోలీసు ముఖ్యాధికారికడకు వెళ్ళినారు. మంత్రియు, జమీందారును రామచంద్రరావు కేసు విషయమై వచ్చినారని వినగనే యా యుద్యోగి యాశ్చర్యమునంది_

‘మీకు చుట్టమాండి రాజాగారూ?’ అని ప్రశ్నించి, ‘ఇవిగో! ఇవి అతని కేసుకు సంబంధించిన కాగితాలు. మావాళ్లు పదిరోజులు రిమాండు పుచ్చుకొన్నారు. అనుమానాస్పదములైన కారణాలు చాలా ఉన్నవి’ అని తెలియజెప్పెను.

జమీందారుగా రా కాగితములన్నియు బరీక్షజేసిరి. అమెరికాలో రహస్యశాఖా కర్మచారుడు వ్రాసిన సముజాయిషీలవి. అమెరికాలో తిలకు జన్మదిన మహోత్సవ సందర్భమున రామచంద్రరా వుపన్యాస మిచ్చినట్లు (ఆ యుపన్యాస భాగము కత్తిరించియున్నది) ఆ యుపన్యాసము విప్లవవాదపూరితమైయున్నట్లు, ‘భారత సందేశ్’ అను పత్రికలో రామచంద్రరావు తీవ్రవాదనలతో వ్యాసము వ్రాసినట్లు (ఆ పత్రిక ప్రతియు నున్నది) ప్రాణకాంతబోసు మొదలగువారితో గలిసి భరతదేశమున విప్లవము గలుగచేయ రహస్యాలోచనలు సలిపినట్లు ఈ మొదలగు వివరము లందున్నవి. ఇవి యన్నియు అప్రూవరుగామారిన ఒక ముద్దాయివలన గ్రహించిన విషయములు.

ఇన్‌స్పెక్టరుజనరల్ గారి యనుమతితో జమిందారుగారువెళ్ళి, ప్రభుత్వ న్యాయవాది (అడ్వకేటు జనరలు) గారిని తీసికొనివచ్చిరి.

వారందరు రామచంద్రరావుగారి కేసును గూర్చి సంపూర్ణముగా తమలో తాము చర్చించుకొనిరి. అడ్వకేటు జనరలుగారితోడను, ముఖ్యమంత్రిగారి తోడను, పోలీసు ముఖ్యన్యాయాధికారితోడను రామచంద్రరావు చాలా తెలివైన యువకుడనియు, నాతడు ప్రపంచమంతట లెక్కలలో ప్రసిద్ధికెక్కిన కొద్దిమందిలో నొకడనియు, అతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో ఆచార్యపదవి సముపార్జింప గోరికయనియు, అతడు ఎమ్. ఎస్ సి. పట్టము నొందినాడనియు, ఆంధ్రులలో నట్టివా రితరు లెవ్వరు లేరనియు జెప్పి వాదించినారు జమీందారుగారు.