ఈ పుట ఆమోదించబడ్డది

370

నారాయణరావు

శారదయు నా మంచముమీద పండుకొనునది. లోకమున కేమి తెలియును? భార్యాభర్తలు సిగ్గుచే మాట్లాడరనుకొన్నారు. ఎంతో సరదాగల నారాయణరావు తల దువ్వించుకొనడు, భార్యనేమియు నడుగడు. శారద భర్తకు నీళ్లు తోడించుటగాని, సబ్బు నిచ్చుటగాని, తువ్వాలిచ్చుటగాని లేదు. శారదకడ నుండి భర్తకుగాని, నారాయణరావుకడ నుండి భార్యకుగాని యుత్తరములు లేవు. ఇది యంతయు నొక విచిత్రదాంపత్య మనుకొనినారు. సూరీడుకూడ నిజము పూర్తిగ గ్రహింపలేదు. శకుంతలమాత్రము సంపూర్ణముగా గ్రహించినది.

ప్రథమదినములలో నారాయణుడు ఆవేదననందెను. అతని ప్రేమ విజృంభించి ఆతని దహించివేయునది. ఆతడు ధీరోదాత్తుడగుటచే, నిశ్చల చిత్తుడై భార్యను పొరపాటుననైన ముట్టుకొనువాడు కాడు.

శారద తన్ను భర్త ఏమికోరునో యని భయపడునది. అందుకనియే కాపురమునకు వచ్చిన ప్రథమదినములలో ఎంతసేపటివరకో నిద్రపోవక, చివరి కొడలుతెలియక నిదురబోవునది. రాను రాను భర్త సద్గుణసంపన్నుడనియు దయార్ద్రహృదయుడనియు సంపూర్ణముగా నవగతమైన దామెకు. అందుచే నిర్భయముగ నామె భర్తతో నొక్క గదిలోనే నిదురగూడునది.

తా నొక్కతియే పండుకొనుచున్నానన్న భావమే యామెకు పరీక్షలకు జదువు రోజులలో లేదు. అప్పుడామె సంపూర్ణముగ బాలికయే.

హిందూకుటుంబములలో భార్యాభర్తలకు పునస్సంధాన మహోత్సవము సలిపినప్పుడు పదుమూడు, పదునాలుగు, పదునైదేడుల యీడుండును. అప్పుడు బాలికలకు ప్రేమయుండుట యరిది. రాను రాను వారికి భర్తలయం దనురాగము వృద్ధియగును.

చెన్నపురిలో భర్తపాటలు, భర్తమాటలు విన నామె కుతూహలపడునది. ఫిడేలు వాయించుకొనుచు పరవశుడై గొంతెత్తి గంభీరమధురముగ బాటలు పాడు భర్తపాట నేపథ్యముననుండి వినుచు, శారద పారవశ్యత నందునది. రెండుమూడుసారు లామె తాను భర్తను బ్రేమించుచున్నానా యని సందియ మందినది. యేల ప్రేమింపకూడదు? భర్త సుందరుడని ప్రతివారును జెప్పెదరే? నిజముగా సుందరుడే! ఏమి తెలివితేటలు!

నేడు నారాయణరావు చేసిన యీ మహాద్భుతకార్యము ఎవరు జరుపగలరు? మహావీరుడు తనభర్త. గ్రీకుకథలలో జదివిన వీరాగ్రగణ్యుల కీయన యేల దీసిపోవును? ఆయన రూపము బొమ్మలలో వేయు వీరుల కెంతమాత్రమును దీసిపోదు. స్నానము చేయునప్పు డాయనమూర్తి ఎంత సుందరమయి కనుపించును?

ఆమె మనోనేత్రములకు నారాయణుని కమ్మెచ్చుల దండలు, పొంకమగు కంఠనరములు, తేజస్సును సూచించుచు మచ్చునకేని యొక యపశ్రుతిరేఖలేని సుందరమగు మోము, నల్లని ఒత్తయిన జుట్టు, విశాలమై ఎత్తయిన చాతీ, పొడు