ఈ పుట ఆమోదించబడ్డది

పరీక్షాఫలితములు

369

హుంకరించి, భోషాణమును ఒక్కపెట్టు అటు అడ్డముగా తిప్పి ఆ వెనుక కాలును, ఇటు అడ్డముగా తిప్పి ఈ వెనుక కాలును ఈవలికి లాగి బరబర యీడ్చి లాగిపారవైచి, ఖాండవదహనము చేయు అర్జునునివలె, లంక దహించు ఆంజనేయునివలె నిలుచుండి, లక్ష్మీపతికడకు వచ్చి, అలసటపడి రోజుచు పడిపోయినాడు.

వేడిగాల్పులో, అగ్నిహోత్రుని వేడిలో జనమునకు గాడ్పు తగులకుండ నొనర్చుటకు వేడికాఫీ రెండు మూడు బిందెలు పంపించుమని తల్లితో నారాయణుడు ముందే చెప్పి వచ్చినాడు. ఆ వేడికాఫీ యెంతమంది ప్రాణములనో రక్షించినది. లక్ష్మీపతి గజగజ వణకుచు నారాయణరావు నదిమిపట్టుకొని తన ఒడిలో చేర్చి, కళ్లనీరు గారుచుండ, ఇంత కాఫీ బావమరది పెదవుల కందిచ్చి త్రావించినాడు. పదినిముషములలో నారాయణుడు తేరినాడు. ఇంటికి చరచర వచ్చినాడు. బండి వద్దన్నాడు, పట్టుకొనవద్దన్నాడు.

ఊరంతయు ‘నారాయణరావుగారు, నారాయణరావుగారు’ అని చెప్పుకొన్నారు. నిప్పంతయు నిశ్శేషముగ నార్పివేయుటకు జనము నియమింప వలయునని, పెద్దకాపుతో జెప్పి నారాయణరా వింటికి వచ్చెను.

వీరభద్రుని యాశ్చర్యమునకు మితి లేదు. ‘ఇతడా నా బావమరది’ యని యాత డాశ్చర్యచకితుడైనాడు. ఆతని ప్రేమంతయు నారాయణరావు నావరించిపోయినది.

జరిగినదెల్లయు బూసగ్రుచ్చినట్లు లక్ష్మీపతి యింటిల్లపాదికి చెప్పినాడు. శారదకు గుండెలు దడదడ కొట్టుకొన్నవి. ‘ఇల్లు కూలితే! నాతండ్రీ! అన్నీ యిల్లాంటిపనులే చేస్తావు నువ్వు అంటూ జానకమ్మ గారు కూర్చున్న కుమారుని తల నిమిరినది. ఇంతలో పెద్దకాపు, ఆతని కుమారులు వచ్చి సుబ్బారాయుడుగారికి నమస్కారము చేసి, నారాయణరావు పాదాలకు దండము పెట్టిరి. సుబ్బారాయుడుగారు రహస్యముగా దన కన్నుల నీరు తుడుచుకొనిరి. తక్కినవారందరు సంతోషబాష్పముల విడచిరి.

‘తండ్రీ, నన్ను రక్షించారు. ఏమి ధైర్యం, ఏమి చొరవ, ఏమి బలం, నారాయణరావు బాబుది! సుబ్బారాయుడు అన్నగారూ, మీ బాబు మా వాళ్ళందరికీ బుద్ధి చెప్పారండీ!’

౧౮

పరీక్షాఫలితములు

ఆ రాత్రి నారాయణరావు తన పందిరిమంచముపై పండుకొని మాగన్ను వైచెను. శారదయూ నారాయణరావును వేఱువేఱుగ పండుకొందురు. శారదకు నింకొక మంచము వేయించుమని రహస్యముగ సూరీడుతో చెప్పినాడాతడు.