ఈ పుట ఆమోదించబడ్డది

368

నారాయణరావు

ఇల్లు మహాగ్ని జ్వాలల విరజిమ్ముచు, ఎఱ్ఱటి పూలతోనిండిన తురాయివలె మండిపోవుచున్నది. ఫెళ ఫెళ, ధణ్ ధణ్ మను ధ్వనులు, పిడుగుబోలి దెసల నావరించుచున్నవి. జ్వాలలు మిన్నంటిపోవుచుండెను. ఆ వేడి భరింప వీలులేనిది.

నారాయణరావు ఒకసారి మహావైశ్వానరతాండవము పారజూచినాడు. పెద్దకాపు నిస్సహాయతను దిలకించినాడు.

‘భోపాణం ఎక్కడుందంటావు?’

‘సావిట్లో తండ్రీ!’

‘నీళ్ళతో రెండు బిందెలఱ్ఱో’ అని కేక పెట్టినాడు నారాయణుడు.

‘నీళ్ళు కారుతూఉండే రెండు తడిగుడ్డలు నా నెత్తిమీద వెయ్యి బావా!” అని లక్ష్మీపతిని కేక వేసినా డాతడు.

లక్ష్మీపతియు, వీరభద్రరావును తడిగుడ్డలు నెత్తిమీద వేయుటయు, రెండు చేతులా రెండుబిందెలు పుచ్చుకొని నారాయణరావు లోని కురికినాడు.

అందరూ ఘొల్లుమన్నారు. ఆత డట్లు చేయునని ఎవరనుకొనినారు! ‘వద్దండో’ అని పెద్దకాపు.

‘అదేమిటోయి బావా’ అని పొలికేక వీరభద్రరావు.

‘నారాయణరావు గారో, కొంపలు ముంచకండో’ అని జనమంతయును.

వీరభద్రరావు స్తబ్ధుడై నిలువబడిపోయినాడు. లక్ష్మీపతి తన బావ వెన్నంటి వెళ్ళబోయినాడు. నారాయణు డాతనికి గుమ్మముకడ కనుపించ లేదు. మంట లాతని గుమ్మముకడనుండి తరిమివేసినవి. అందరూ ఆశ్చర్యముతో, భయముతో నిశ్చేష్టులైరి. మంటలును శబ్దముచేయుటకూడ మానినవా!

గుమ్మముకడ ఒక బిందెడు నీళ్లు తలపై ద్రిమ్మరించుకొని, ఆ బిందెను వెనుకకు విసరి వైచి, వంగి పోయినాడు మండువాలోనున్న భోషాణము దగ్గరకు ఆతని సాహ సౌదార్యాలకు మెచ్చి, వైశ్వానరుడు మిద్దెయున్న ఆసావిడి లోనికి తొంగిచూచుట మానినాడు. మండువాలోని మంటలు గుప్పుగుప్పున వచ్చుచున్నవి. అప్పుడే భోషాణము అంటుకొన్నది. రెండవబిందె నీరు నెత్తిపై కుమ్మరించుకొని, వంగి భోషాణం ముందుకాళ్ళు రెండునుబట్టి ఎత్తి దడదడ గుమ్మముకడకు లాగికొనివచ్చినాడు.

లోపల ఏమి చేయుచున్నాడో, సొమ్మసిల్లి పడిపోయినాడో యని కంఠ పూర్ణమగు దుఃఖముతో లక్ష్మీపతి నీళ్లబిందెలు దెప్పించుచు, చేటలతో గుమ్మము లోనికి బోయించుచు, దానును లోనికి దుముక సిద్ధముగా నున్నంతలో మంటలలో నుండి నారాయణుడు భోషాణము లాగికొనుచు వచ్చుట జూచినాడు. నారాయణుడు గుమ్మవరకు వెనుకకోళ్ళు వచ్చునట్లు లాగి, మహాసత్త్వమున