358
నారాయణరావు
స్త్రీలయెడల, పరజాతులయెడ తమ పశుత్వ మింకను జూపు మానవులు కోట్లకొలది యున్న ఈ యుగము నిజముగ కలియుగమే! భగవంతు డున్నాడని గాని, తాను శుద్ధ సత్యమూర్తియగు భగవంతుని యవతారమనిగాని మనుష్యు డెటుల మరచిపోవునో? తన అక్క సత్త్వగుణ సంపన్నురాలు. భర్తయనిన భగవంతుని యవతారమని భావించు పూర్వయుగాలనాటిది. అట్టి శుభచరితలకే కష్టములన్నియు సమకూడును గాబోలు. గడుసుదనమున వర్తించుచు భర్తను తమకు దాసానుదాసులుగా జేయు భార్యల బ్రతుకు పూవులలో బ్రయాణమే కదా?
నారాయణరావు బావ గారికడకు బోయి, ‘బావా నీకు బుద్ధిలేదోయి. నీవు మనుష్యుడవనుకున్నాను గాని, కేవలము పశువుతో సమానుడవని అనుకోలేదోయి. ఇదేమిటి నీకింత కోపము? కోపాని కంతుఉండాలి. ఎంతవరకూ ఈ కోపం వెళ్ళడము? పోనీ నీకేమి చిక్కురాకుండా ఏదైనా పదునైన ఒక కత్తిచూసి, దాన్ని నరికివెయ్యరాదూ? లేదూ విషం తెచ్చిపెడతాను, నీ కసితీరగా దానినోట్లో వెయ్యి. ఆ విషం మనుష్యుల్ని నరకబాధ అనుభవింప జేసి మరీ చంపేదిగాచూచి తెస్తాను. అల్లా చంపు. అప్పటికి నీకోపం అంతానికి వస్తుందేమో? మొదట కోపం తెప్పించుకోడం, తర్వాత విచారించడం, రెండూ ఒకేజాతికి చెందినవి. అదిగో సత్యవతికి మూర్ఛపట్టుకొన్నది. ఇంక దాని జన్మ అల్లా పీల్చి పిప్పిచేస్తుంది. అది చచ్చినదాంతో జమ. నీకు తృప్తితీరిందా?
‘ఒక వేళ మా అక్కయ్యయందు దోషం ఉందంటావా చెప్పు. అది పెద్దరకం దోషం అయితే నువ్వు చేసినపనికి సంతోషిస్తాను.’
నారాయణరావు కన్నుల నీరుతిరిగినది. ‘బావా క్షమించు. ఈ నా కటిక జన్మానికి కనుల నీరుతిరగడం ఇదే మొదటిసారి. ఏదో కోపంకొద్దీ అన్న మాటలు. కాని కోపం చంపుకొని చెపుతున్నాను, నువ్వు చేసిన పాపానికి నివృత్తి నీలోనే ఉన్నది. నీ హృదయం కరిగేటందుకు, నాలోని కల్మషం అంతా పోయేటందుకు నేను నాలుగురోజులు మీయింటనే ఉపవాసవ్రతం చెయ్యవలెనని ఉంది’ యని నారాయణరా వూరకొన్నాడు. వీరభద్రరావు బావమరది. వచ్చినప్పటినుంచి యవనతవదనుడై, పాలిపోయిన మోముతో నున్నాడు.
ఆనాడంతయు వైద్యుల బిలిచి యక్కగారికి వైద్యము చేయించినాడు నారాయణుడు. ప్రక్కయింటివారు మేనగోడలికి దిండి పెట్టెదమని తీసికొనిపోయి భోజనము పెట్టినారు. నారాయణరావు ఎందరు భోజనమునకు రమ్మన్నను వెళ్ళినాడు కాడు. సాయంకాలము మూడుగంటలకు సత్యవతికి మెలకువ వచ్చినది.
మెలకువ వచ్చునప్పటికి సోదరుడగు నారాయణరావును జూచి కలయనుకొన్నది. సత్యవతి కొంతవడికి నొడలెఱిగి కనుల నీరునించినది,