ఈ పుట ఆమోదించబడ్డది

ఒపెరా

349

ప్రవాహాలు ప్రసరించినవి. ప్రేమావేశముననో ఏమో ఆమె వణకిపోయినది. సిగ్గుతో చేయి వెనుకకు నెమ్మదిగా లాగికొన్నది.

విశ్రాంతి సమయమున నారాయణరావు మొదలగువారు బయటకు పోయి సిగరెట్లు కాల్చుకొనివచ్చినారు. నారాయణరావు వెలగల చాకొలెట్లు (ఒక విధమగు మిఠాయిల) గొని అవి సూరీడు కందిచ్చుటలో తూలి శారదపై వ్రాలినాడు. అరనిమేషములో సర్దుకొన్నాడు.

భార్యాభర్త లిరువురకు దేహమున మెరుపుతీగెలు అలముకొన్నవి. శారదకు నాట్యమున తక్కిన భాగమంతయు దానే నాట్యమాడుచున్నట్లు తోచినది. ఆమె యా యానందములో లీనమై తేలిపోయినది. ఆ ప్రేక్షకులు, ఎదుట దృశ్యము, సర్వమును మరచినది. ఓరజూపుతో భర్తను చూచినది. ఆ చిరుచీకటిలో సమున్నతాంగుడు, సుందరుడగు భర్త దివ్యునివలె యామెకు దోచినాడు. ఆమె కన్నుల మధురిమములు తిరిగినవి. హృదయాన పరిమళము లలమినవి. లోకమంతయు సంగీతముతో నిండిపోయినది.

నాట్యము (ఒపెరా) పూర్తియగుటయు మనవారందరు బయటకువచ్చి తమ తమ బసలకు జేరినారు, మరునాడు సాయంకాలము నారాయణరా వింటికడ వారందరు చేరినారు. రాఘవరాజు, రాజారావు వెళ్ళిపోవలసిన దినములు వచ్చినవి. కావున స్నేహితులందరిని, రోహిణిని, సరళను, నళినీదేవిని ఉపాహారముల విందునకు, రాత్రి విందునకును బిలిచినాడు. తండ్రిగారికి జబ్బు పూర్ణముగ నివారణ మొనర్చిన డాక్టరు రంగాచారిగారికీ, ఆయన సహాయవైద్యులకు తేయాకునీటి విందును, రాత్రి సంపూర్ణమగు విందును, ఆనందరావుగారును, నారాయణరావు గురువుగారును, నటరాజన్ మొదలగువారందరును వచ్చిరి. హైకోర్టు న్యాయవాదు లంద రరుదెంచిరి.

శ్యామసుందరీదేవి వచ్చుట కామెకు పరీక్షలు. ఉపాహారములు, తేయాకునీరు మొదలగునవి యన్నియు, కోమలవిలాసమువారు సరఫరా చేసినారు. వారి బ్రాహ్మణయువకు లిరువదిమంది తెల్లని గాంధీటోపీలు, లాల్చీలు ధరించి తినుబండారము లందరకు వడ్డించుటకు సిద్ధముగానున్నారు. హైకోర్టు న్యాయాధిపతులను, చెన్నపురిలోని నాగేశ్వరరాయాద్యాంధ్ర ప్రముఖులను, పెద్దషాహుకార్లను విందునకు బిలిచినాడు నారాయణరావు. నారాయణరావు, రాజారావు, పరమేశ్వరుడు, లక్ష్మీపతి అన్ని సరంజాములు చేయించినారు. అద్దెకు పాలరాయి బల్లలు, చక్కని కుర్చీలు తీసికొనిరాబడినవి.

నారాయణరావు భవనము వెనుకనున్న విశాలవనములో విందు. తోటమాలి యని పేరుపొందిన నారాయణరావు తోటయంతయు గులాబీలతో, రంగు రంగుల మెట్టతామరపూవులతో వివిధరకాల చామంతులతో, బోగైనువిల్లాలతో చిత్ర చిత్రపు క్రోటన్సు మొక్కలతో నలంకరింపబడి కన్నులవైకుంఠముగ నున్నది. చెట్లలో, ఆకులలో, జొంపములలో పూవుల నడుమ రంగు రంగు విద్యు