ఈ పుట ఆమోదించబడ్డది



మోహధర్మము

నారాయణరావు తనకడకు రాకమునుపే రాజేశ్వరుడు పుష్పశీల హృదయము మారినదేమో యని సందియమందసాగెను. అతని తోటియుద్యోగి యగు నా మహమ్మదీయ యువకుడు రాజేశ్వరరావింటికి బదింబదిగ రానారంభించెను. రాజేశ్వరరావుమాత్రము పుష్పశీలకు సంపూర్ణ స్వాతంత్ర్యమిచ్చి, యామె యిచ్ఛానుసారము మెలగనిచ్చెను. తమ ప్రేమస్వాతంత్ర్య సంఘాదేశములు, ఆశయములు విజయమందుట కాచరించవలయు మార్గములు అన్నియు పుష్పశీల కుపదేశించినాడు. ‘నువ్వు నీప్రేమ ననుసరించి మెలగవచ్చును. నీకు నామీద ప్రేమ యెంతకాలము ఉంటుందో అంతకాలం నాదగ్గిర ఉండవచ్చును. నీకు ప్రేమ సంపూర్ణముగ నాయెడల నశించిపోయి, వేరొకని నీవు వలచినచో నీవు నిస్సంశయముగ ఆ పురుషునికడకు వెళ్ళిపోవచ్చు’ ననియు రాజేశ్వరరావా సుందరితో వచించినాడు.


పుష్పశీల చపలచిత్త, ఆమెహృదయము సీతాకోక చిలుకయే. రాజేశ్వరునిపై మమకార మప్పుడే నశించిపోసాగినది. ఇంతలో నీ మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని యింటికి రా నారంభించినాడు. రాజేశ్వరరావు పుష్పశీలకు నా మహమ్మదీయ యువకునితో పరిచయము గలిగించెను.

పుష్పశీలకు ఇంగ్లీషున మిడిమిడిజ్ఞానము కలదు. కాన ఆ భాషలో నా మహమ్మదీయ బాలకునితో నేదేని మాటలాడుచు వినోదించుచుండెను. ఆ బాలకుడు రాజేశ్వరరావు లేని కాలములోకూడ రాజేశ్వరునింటికి వచ్చుచుండెను.

ఒక నా డాత డా యువతి చేయి పట్టుకొన్నాడు. పుష్పశీల మాటాడలేదు. చిరునవ్వు నవ్వినది. రెండురోజులు పోయిన వెనుక నా మహమ్మదీయ యువకు డామెను వెనుక నుండివచ్చి కవుగిలించుకొన్నాడు. పుష్పశీల ఆతని బాహువులలో బులకరించినది. వారిరువు రంత శయ్యాగృహమున కేగినారు.

రాజేశ్వరున కప్పుడే పుష్పశీలకు నా మహమ్మదీయ యువకునకు గల సంబంధము కరతలామలకమై తోచినది. ఆనాటి నుండి రాజేశ్వరుని హృదయమున నెచ్చటనో కనబడని కంటకమువలె నీర్ష్య బాధింపజొచ్చెను. రాజేశ్వరుడిది ప్రథమమున నీర్ష్య యనుకొన లేదు. ఏదో బాధ యనుకొన్నాడు.

అప్పుడే నారాయణరావు వచ్చినాడు. నారాయణుడువచ్చి యేమేమియో చెప్పినాడు. గాంధీతత్వము బోధించినాడు. తన భార్యను నితరులకు సంతానార్థ మిచ్చిన ఆర్యకాలము నాటి గృహమేధి తప్పొనరించినాడా? లేదు. తప్పు అనునది కాలమునుబట్టి మారుచుండునుగదా. తప్పు అని కనుగొనుటకు ముఖ్య నూత్రము మనము హింస నాచరింపుచున్నామా యని నిర్ణయించుకొనుటయే.