ఈ పుట ఆమోదించబడ్డది

318

నారాయణరావు

భగవంతుడే లేడనువారు, అనేక లక్షల భగవంతులున్నారనువారు, ఒక్కడే భగవంతుడున్నాడను వారు, మూడువిధములుగ జనులున్నారు. ఈ మూడు వాదనలను సనున్వయము చేసినాడు శ్రీకృష్ణుడు. సాంఖ్యము ద్వైతవాదమునుకూడ మించిపోయినది. సాంఖ్యులు విశ్వకారణము నేమందురు? విశ్వము నావరించిన రెండు మూలసూత్రములు పురుషుడు, ప్రకృతి, పురుషుడు సాక్షి. ప్రకృతిశక్తి .

సాంఖ్యము వెనుక యోగము చర్చించినారు. గీతలోని యోగమార్గము పతంజలి చెప్పినదికాదు. పతంజలి గీతకు కొన్ని వేల వర్షము లిటీవలి వాడు. యోగమునుగూర్చి అనుశ్రుతముగా, పరంపరగా వచ్చిన దానిని పతంజలి ప్రోగు చేసి, సూత్రరూపముల వెల్లడించినాడు. గీతలో చెప్పుయోగము పతంజలి కెన్నో సంవత్సరముల పూర్వకాలము నాటి ఋషిసాంప్రదాయమగు యోగము.

ఆ వెనుక ఉపనిషన్మతమును గూర్చి చర్చించినారు. భగవద్గీత ఈ మూడింటిని ఎట్లు సమన్వయించినది చర్చించి నారు.

సాంఖ్యులు పురుషుడు, ప్రకృతి, త్రిగుణములు, త్రిగుణ జనితములగు ఇరువది నాలుగు తత్త్వములు అను వానితో మొదలు పెట్టి, వెనుక నుపనిషత్తులు చెప్పిన క్షర, అక్షర బ్రహ్మములను జెప్పి ఈ రెంటికిని సమన్వయము చేయు పురుషోత్తముడు అని పరబ్రహ్మవాదమును సిద్ధాంతీకరించును, క్షరబ్రహ్మయు ప్రకృతియే. అక్షరబ్రహ్మయు సాక్షి. క్షరముతో సంబంధము లేక తనలో జనించిన క్షరమునుజూచుచు నుండును. క్షరబ్రహ్మయు అక్షరబ్రహ్మ స్వరూపమే. ప్రకృతిని లయించి ప్రకృతిని ఆటంక ప్రకృతిలో చేరియును తన స్వరూపమగు క్షరబ్రహ్మమును జూచుచుండును. ఆ క్షరపురుషుడు ప్రకృతిలో జేరక ప్రకృతి స్వరూపమగు క్షరబ్రహ్మమునకు సాక్షి. అక్షరబ్రహ్మమునకు పైన పరబ్రహ్మము పురుషోత్తముడున్నాడు. క్షరాక్షరబ్రహ్మ లిరువురు పరబ్రహ్మ స్వరూపములే. పరబ్రహ్మమే తన ప్రకృతివలన జీవాత్మయగును. ఆ ప్రకృతియే మూలప్రకృతి. ఆ మూల ప్రకృతిలో నుంచి జనించినది సాధారణ ప్రకృతి.

ప్రేమాశయము

సూర్యకాంతం పరీక్షలో బాగుగా వ్రాసినది. తప్పక విజయమందితీరునని నారాయణరావు నిశ్చయించినాడు. రాజారావును వీడి నారాయణరావును బరమేశ్వరుడును చెన్నపురి చేరినారు. శారద పరీక్షలో బాగుగ వ్రాసినట్లు జమిందారుగా రల్లునికి వ్రాసినారు.

దారిలో బరమేశ్వరునికి నారాయణరావు రాజేశ్వరుని చరిత్రయంతయు జెప్పినాడు.