ఈ పుట ఆమోదించబడ్డది

స్నేహపవిత్రత

309

మున మూర్ఛముంచినది. పశ్చిమారుణచ్ఛాయ యొండు గవాక్షమున లోన బ్రవేశించి శారదమోమును వెలిగించినది. ప్రణయతపస్సిద్ధికై తన ప్రణయాధి దేవియే ప్రత్యక్షమైన ట్లాతని కామె గోచరించినది.

ఇంతలో ఉల్క యొకటి మెరసిన ట్లా మోములో మార్పులు జనించినవి. ఆ మోము శ్యామసుందరీ దేవి మోమైనది. శ్యామసుందరి తన్నతి ప్రేమతో దిలకించిన ట్లాతనికి దోచినది. శ్యామసుందరి చిరునవ్వు నవ్వి, లేచి, చేతులు చాచి తనకడకు వచ్చి తనపై వంగినది. ఆమె యూపిరి పరిమళములు తన్నలమినట్లయినది. అతడు రక్తము వేడియై దేహమెల్ల ప్రవహింప, హృదయము హోరులెత్త, ఆమె మెత్తని చిగురాకు పెదవులు తన పెదవులపై తగిలినట్లు భావించినాడు. ఇంతలో నామె, తన్ను గౌగిలించిన ట్లయినది.

ఆమె తమిదీర తన్నతిమోహావేశమున చుంబనమొనరించిన ట్లాతడు తన భావపథమం దూహించి చటుక్కున లేచి తన పడకగదిలోనికి రెండడుగులలో చేరినాడు.

ఆతడు చకితుడై బాణహతిచే సుడివడిపోయి రెక్కలు టపటప కొట్టుకొను గువ్వపిట్టవలె హృదయము చలించిపోవ నిట్టూర్పు నించుచు పర్యంకము జేరినాడు. ఆతని కన్ను లెఱ్ఱవారిపోయినవి. కణతల చిరు చెమ్మటలు నిర్మలాకాశాన నల్లని మేఘశకలములవలె పొడసూపినవి.

ఏమిది? మనస్సులోనైన నా బాలిక శీలము చెరుపవచ్చునా? అది పాపము! పవిత్రమగు నాత్మకూడ పంకిలమ్మగు ననునంత పాపకార్యమది. ఎంత గర్హ్యము!...

ఎట్టఎదుట తన ఇల్లాలుండ, బరకాంతపై దనకీ యసమయావేశ మేల జనింపవలెను? భార్యను తాను ప్రేమింపకూడదా? అయినచో నామెయే తన్ను చేరవచ్చినట్లు తన యింద్రియములకు మించిన శక్తి తన్నట్లు కదల్చివేసినదా?

శ్యామసుందరి యను భ్రాంతికి కారణము తనలోనున్న కల్మషమే, అయినను తాను ద్రోహము చేయుటా?

శ్యామసుందరీదేవి పవిత్రచరిత్ర కావుననే యాత డామెతో స్నేహము చేసినాడు. వ్యక్తికి స్నేహము పాపమా? గర్హ్యమా? పురుషుడు వనితలతో నేల స్నేహము చేయరాదు? పురుషుని పురుషుని ప్రేమలతల పెనవైచు స్నేహము పవిత్రమైనచో, మగవానిని వనితను సువాసనాబంధముల జేర్చి వైచు స్నేహము మాత్ర మేల పవిత్రముకారాదు?

పురుషుల పరస్పర ప్రేమగూడ ధనలాభాది వ్యాజమూలకమై నీచమగును. స్త్రీ, పురుష స్నేహములో నంతకంటె నీచమగు కారణముండుటకు వీలున్నది. స్నేహము పవిత్రమంటారు. స్నేహము లేని పురుషుని మొరడనియు, శ్మశానములోని చెట్లనియునందురు. మిత్రకోటిలో మైమరచువాని బంధుసముద్రుడంటారు.