ఈ పుట ఆమోదించబడ్డది

308

నారాయణరావు

నాడు. హామ్లెట్టు సజ్జనుడు. తన తండ్రిని తన పినతండ్రి చంపెనా లేదా యను సంగతి పూర్ణముగ దెలిసికొనకుండ నెటులాతని శిక్షించుట అని యాతడు సందేహించినాడు. ఆ సందేహమే యాతని నడంచినది. ఒథెల్లో సర్వ మానవులను బూర్ణముగ నమ్మినాడు. ఆ నమ్మకమే భార్యవిషయమున అపనమ్మకమైనప్పుడు క్యాసియాపై నసూయ, భార్యపై కోపము, చివరకు తాను తన భార్యయు నశించిపోవుట తటస్థించినది. కావున సద్గుణములైనను అహంకారమున జనించిన ట్లయిన వినాశ హేతువులు. ఇంత గొప్పవియైనను షేక్సుపియరు నాటకములకు సంపూర్ణత్వము రాలేదు. మహాకళలైనను సంపూర్ణత్వమునందనిచో ఉత్కృష్టానంద మెట్లీయగలవు? భారతీయ నాటక శిల్పులకు సంపూర్ణత్వమున్నది. కాళిదాసు రచించిన శకుంతల గమనించినచో నా మహానాటకము రెండు భాగములుగా విభజింపబడినది. ప్రథమ భాగమున దేహమనఃప్రాణలోకముల ప్రదర్శించినాడు.

‘దుష్యంతుడు మహారాజు, శకుంతల వనకన్య. మహారా జితర దేవేరులలో శకుంతలను జ్ఞాపక ముంచుకొనవలయును. శకుంతలను మరచినాడు. ప్రాపంచికమగు నానందము కొలదిమాత్ర మనుభవించి యా భౌతిక సుఖములో మైమరుచుట నీ యాత్మకు భంగకరము. ఓ ఋషికన్యా, నీ ఆర్ష సంప్రదాయము మరువకుము’ అని దుర్వాసుడు ఆమెను శపించినాడు. ఆర్యబాల విషయ సుఖములకోసం జనింపలేదు. సేవకే. తన ఆత్మ తాను తెలిసికొనుటకే. కావున మేనక శకుంతల నెత్తికొనిపోయి కశ్యపాశ్రమమున వదలినది. ఆర్యసంప్రదాయమున పుత్రుల గనుట పున్నామనరక బాధ నివర్తించుకొనుటకు, బితౄణము దీర్చుటకు. అందు కొక పుత్రుడు చాలు. శకుంతల మాతయైనది. రెండవ భాగమున శకుంతలా దుష్యంతులకు స్వర్గలోక పరిసరముల పునస్సంధానము కలిగినది. అప్పటికి దుష్యంతుడు రాజర్షి, శకుంతల యోగిని, ఇంక పవిత్రమగు వానప్రస్థాశ్రమము, సచ్చిదానంద జ్యోతిర్ముఖమగు జీవితద్వంద్వము.

‘ఇయ్యది భారతీయుల ఉత్కృష్టాశయము. కవిత్వపాకములో, కథా సరళిలో, అలంకారములలో జీవిత ప్రదర్శనములో ఒకరికొకరు తీసిపోరు కాళిదాసు, షేక్సపియరులు. కాని కాళిదాసులోని లాలిత్య మాధుర్య గంభీరతలకు షేక్సుపియరు కొంచెము తగ్గినాడు. కాళిదాసు గౌరీశంకర శిఖరము (ఎవరెష్టు), షేక్సపియరు ధవళగిరి’

ఈరీతి నింగ్లీషులో నుపన్యసించు భర్తయొక్క భాషగాని, భావములు గాని సంపూర్ణముగ గ్రాహ్యము గాకపోయినను శారద విస్ఫారిత నేత్రములతో నందమగు మోహముతో ఆకర్షింపబడి పరవశమైన హృదయముతో నట్లే కూర్చుండి భర్త వంక అనిమిషయై చూచుచున్నది.

చీకట్లు దిశల ప్రసరించుచున్నవి. సాయంకాలపు వెలుగు లా గదిలోనికి తొంగి చూచుచున్నవి, తోటలోని పూవుల సువాసన జగత్తును పరిమళ వివశత్వ