ఈ పుట ఆమోదించబడ్డది

300

నా రా య ణ రా వు

అప్పుడొకనాడు భర్తను జేరి యామె ‘ఇక నెప్పుడు నాయెడ దోషం చేయనని ప్రతిజ్ఞ చేయండి’ యని కోరినది. పరమేశ్వరుడు సర్వభూతముల సాక్షిగ నా ప్రమాణ మొనరించినాడు.

‘రుక్కూ! నా హృదయము పంకిలమయినమాట నిజము. కాని నేను దుర్బలుడను. ఎప్పుడైనా ఈలాంటి గాఢనైచ్యమై వచింపరాని పాపంలో పడిపోయింది రెండుసారులే. నన్ను క్షమించమని నేను కోరను. కాని నువ్వు పవిత్రమైన చరిత్ర కలదానవు. నీకు నన్ను భర్తగా సమకూర్చిన విధే దూరవలసినవాడు. ఏమి చేయను దేవీ! నాబోటి తుచ్ఛులు ఈ ప్రపంచంలో జన్మించి తమచుట్టూ ఉన్న నిర్మలత్వానికి కళంకం తెస్తారు. స్వచ్ఛమైన నీ జీవితానికి నలుపుమచ్చను నేను.’ అని కన్నుల నీరు నించుకొన్నాడు.

రుక్మిణి భర్తగారి బాధను జూచి భరించలేకపోయినది. కరుణార్ద్రహృదయయైన యామె వెల్లువయై ప్రవహించి, భర్తను చుట్టివేయుచు తన పాదాలపై మోమువంచి వాపోవు భర్తను లేవనెత్తి తన హృదయానికి జేర్చుకొన్నది. నాటినుండియు జిన్న బిడ్డలరీతి నెప్పటియ ట్లత్యంత ప్రేమతో వారు మెలగినారు.

రుక్మిణి కివియన్నియు నొకసారి సినిమాలో కథవలె గోచరించినవి. అప్పుడు మనస్సు కుదటబడ, నిట్టూర్పునించి సహజమగు మర్యాదతో భీతితో రోహిణీ, సరళా, నళినీదేవులతో మాటలాడి కొమార్తను గూర్చిన వారి మేలములకు హాసవదనయై జవాబులిచ్చినది. సూర్యకాంతము సతతము నా బాల నెత్తు కొనుటయే. ‘వదినా, నా కాళ్ళమీద పడుకోబెట్టమ్మా! నువ్వు నీళ్లుపోస్తే నేను తుడుస్తాను వదినా. కోడలు నవ్వుతుందిసుమా’ అని ఆమె ఆనందమున మునిగిపోవును.

రుక్మిణి: కాదమ్మా! మామయ్య ఎప్పుడు వస్తాడో? అని అత్తయ్య కనిపెట్టుకు ఉన్నదిగదా అని నవ్వినది.

సూరీ: అబ్బా! అసాధ్యురాలే నా కోడలు వదినా? తల్లిపోలికే!

రుక్మిణి: వేశావు బాణమూ?

అందరు నవ్విరి. శారద యా మాట విని యాగిపోయినది. ఆమె హృదయమునం దొక్కసారి గుబుక్కుమన్నది. తన చిన్న ఆడుబిడ్డ సూరీడునకు భర్తయన నింత ప్రేమయా! దూరముననున్న భర్తకై ఎదురుచూచుటయా? నిజమే! అప్పుడప్పుడామె యుత్తరములు వ్రాయుచుండును. సూరీడు గదిలో నామె భర్తగారి ఛాయాచిత్రమున్నది. ఆమె మెడలోని బంగారు గొలుసులో చిన్న చిత్రమున్నది. భర్తయామెకు వ్రాసిన యుత్తరములన్నియు విశాఖపట్టణపు మంచిగంధపు పెట్టెలో నుంచుకొన్నది. అవి యన్నియు మరల మరల తీసి చదువుకొనుట శారద కనిపెట్టినది.

తన యింటిలో గాపురమున్న యీ రుక్మిణీ పరమేశ్వరమూర్తులు ప్రేమచే