వెఱ్ఱి తల్లి
299
‘ఏమి బుగ్గలమ్మా నీ కూతురుకు రుక్మిణమ్మగారూ’ అని మేలమాడినది.
‘నా మేనకోడలు బుగ్గలబూరెమ్మ’ అని సూరీ డన్నది.
‘ముష్టిపిల్ల! మంత్రసానికి డబ్బిచ్చి కొనుక్కోండి’ అని వంటలక్క రామమ్మ అన్నది.
‘ఒరే అబ్బాయి! దీనికి ఏం పేరు పెడతారో చాలా పెంకిపిల్లలా ఉందిరా’ అని నారాయణరావును జూచి యాతని పెత్తల్లి కొమార్తె బంగారమ్మ అన్నది.
‘వెఱ్ఱితల్లి’ అని పేరు పెట్టండి అని రుక్మిణి అన్నది, అలసట పొందిన నవ్వుతో.
పదిరోజులు సుఖముగా గడచి పురిటినీళ్ళు పోసినారు. బాలసారెలేదు. శిశువు దినదిన ప్రవర్థమానయై ఒళ్లు చేయుచున్నది. రోహిణీదేవి యా బాలికకు చిట్టిచొక్కాలు కుట్టుకువచ్చినది. వెండిచెంచా, పాలు పోసికొనుట కొక వెండి కొమ్ముచెంబును బహుమతి పట్టుకొనివచ్చినది.
రోహిణీదేవి వచ్చినప్పుడెల్ల రుక్మిణి హృదయమున గలత జనించునది. భర్త యా బాలికను బ్రేమించుచున్నాడని యెచ్చటనో యామెలో మారుమూల ప్రతిధ్వనించినది. రోహిణీదేవి తనకన్న యందకత్తె. రోహిణియు తన భర్తయు సర్వదా మాట్లాడుకొనుచుందురని యామెకు గర్ణాకర్ణిగ తెలిసినది. శ్యామసుందరియు నారాయణరావునుగూడ స్నేహితులని విన్నను, వారలను ఇసుమంతయు నామె యనుమానించలేదు. భర్త తన ప్రాణమును దనకు ధారపోయునని యామెకు దెలియును. అయినను భర్తహృదయమున ప్రేమ సముద్రము నిండియున్నదనియు, నయ్యది యెవ్వరిపైన నైన సులభముగ ప్రవహించి పోవుననియు నామె గ్రహించినది.
తానంత యందకత్తియ గాననియు భర్తృసంపూర్ణ ప్రేమను దాను జూరగొనజాలననియు నామెకు విదితమే. భర్త యొకటి రెండుసార్లు లెవరి తోడనో మైమరచి ప్రవర్తించినాడనియు నామె గ్రహించినది. కాని ఇదమిత్థమని తెలుపలేదు. లోలోన నొకటి రెండు వారములు కుళ్ళిపోయినది. అది పరమేశ్వరుడు చూచినాడు. తాను భార్యతో నగ్నిదేవుని యెదుట జేసిన వాగ్దానమునకు భిన్నముగ రెండుమూడుసారులు వివశుడై చరించినను ఆ వెనుక ఘోర నరకబాధ ననుభవించినాడు. అతనికి దలగొట్టినట్లయినది. ప్రపంచము నల్లబడి పోయినది. భార్య ఘోరనరక మనుభవించుచున్నదని యాతడు గ్రహించి సర్వము మరచిపోయి యా బాలిక పదములకడ బ్రణయపూజామతియై మోకరిల్లినాడు.
అయినను వారట్టుల రెండు వారములు బాధనందినారు. పరమేశ్వరమూర్తి పరితప్తచరిత్ర మాతని భోజనములో, నిద్రలేమిలో, భార్యకు దోచినది. ఎట్టకేలకు పతిప్రాణయగు ఆమె నావరించిన దుఃఖమేఘములు తొలగిపోయినవి.