ఈ పుట ఆమోదించబడ్డది

ప ర మే శ్వ ర మూ ర్తి

29


ఆమె తెల్లబోయి భర్తవంక జూచినది.

‘పోనీలే. ఇదేమిటి? ఈ గది ఇలా ఉంచావు? గదిని అలంకరించడం జన్మ నలంకరించుకోవడమే అని చెప్పలేదూ నేను! మరి ఈ సామాను కొట్టేమిటి?’

‘మీరు దూరానఉంటే నా కెందుండీ! ఎల్లాగండీ గది అలంకరించుకొని కూచునేది?’

‘పోనీలే’ యని పరమేశ్వరుడు రుక్మిణిని మరల తన హృదయమునకు హత్తుకొని ‘ఒక ముద్ది’ మ్మనియెను. ఆమె లజ్జారుణవదనయై యిటు నటు చూచి నాథుని పెదవుల తన పెదవుల నొక్కి, ‘వస్తా’ నని యింటిలోనికి మాయమైనది.

పరమేశ్వరమూర్తి శ్రుత్యపశ్రుతులు వెలుగు నీడలవంటివని యెఱుగును. ఎంత విచిత్రమగు శ్రుతి నీ వాపాదించుకొనగలవో యంత యపశ్రుతి వెన్నంటి గోచరించుచునే యుండును. రూపెత్తిన తన యాశయమై, పులకరాలు గలుగ జేయు బాలిక భార్యయైనదని సంతసింతమన్న నామె తన్ను ప్రేమింపకయైన పోవును, లేదా కర్కశహృదయయైన నగును. పరిపూర్ణత యెక్కడి దీ సృష్టిలో!

తల్లిదండ్రులతో ముచ్చటలాడి, పుట్టింటికి బిడ్డలతో వచ్చియున్న చెల్లెలితో మృదూక్తులాడి బిడ్డల నాడించి, పట్టణము నుంచి కొని తెచ్చిన బహుమతు లెవరివి వారికిచ్చి, భోజనమాచరించి, నిదురబోయి లేచి, పరమేశ్వరుడు గది నలంకరించుకొన మొదలిడినాడు.

వచ్చిన నాటి రెండవరోజున పరమేశ్వరునకు నారాయణకడనుండి కమ్మ వచ్చినది.

‘ఓరి పరమం! నా హృదయానికి ఎంతో దగ్గిర ఉన్న కవిరాజూ! విను, ఆ బాలిక సౌందర్యం అసలు శారదకు లేదు. నన్నూ, నా హృదయాన్నీ, నా ఆత్మనీ తనలో పెనవేసుకుంది. తనలో ఐక్యం చేసుకుంది. మా చిత్రకార మండలిలో ఆమె బొమ్మ చిత్రించడానికి ఒక్కరికైనా కుంచె నడవదోయి. ఆమె శరీర సౌష్ఠవము విడివడబోయే మల్లెమొగ్గల పోగేరా! ఆమె కళ్ళల్లో కథలు నర్తించాయి. జమిందారుగారితోకూడా వచ్చాడే, ఆయన-శ్రీనివాసరావు గారు ఆ ఊళ్ళోకల్లా మంచి ప్లీడరు. ఆయన ఇంటిదగ్గర నుంచి వెళ్ళాం జమీందారు గారి ఇంటికి. ఆయన ‘పిల్ల నచ్చిందా’ అని అడిగాడు. నచ్చిందని చెప్పటానికి నేను తగుదునురా పరమం! ఆ బంగారుపోత విగ్రహానికి, ఆ పువ్వుల ప్రోవుకు, ఆ దివ్య బాలికామణికి నేను తగుదునా పల్లెటూరి బండమనిషిని! నువ్వు రైలులోనే జమిందారు గారి ఉద్దేశం గ్రహించావుకదా! మన వాళ్లందరూ అదే గ్రహించారు. నాకూ నిముషంలో అవగాహన అయింది. అప్పటినుండీ నాకు ఒకటే సిగ్గు. వారి అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి చేయకుండా ఉంచింది నా యీ కర్కశ పురుషత్వానికి బలియివ్వడాని కేమో!