298
నా రా య ణ రా వు
శ్యామసుందరి చిన్నతనమునుండియు గంభీరహృదయ. ఈశ్వరోన్ముఖ. మానవసేవ చేయవలెననియే యామె వైద్యశాలయందు చేరినది. దేశసేవచేయు శ్రీ సరోజినీదేవి, శ్రీ కస్తూరిబాయి మొదలగు వనితామతల్లులవలె దనజన్మము సేవకై యర్పణమని సంకల్పించుకొన్నది. వీలయినప్పుడెల్ల రాట్నము వడకును, చెల్లెండ్రచేత వడకించును.
ఆమె నిమీలితనేత్రయై, హృదయమున దక్షిణహస్తతల మదుముకొని, ధ్యానించుకొనుచు యా పడక కుర్చీపై నట్లే పండుకొనియున్నది.
శారదకు భర్తయే గురువైనాడు. ఆయన పాఠము చెప్పిన విధానము స్మరించుకొనుచు తన పడకగదిలో సోఫాపై మేనువాల్చి కన్ను లరమూతలుగా, ఏమేమో పుల్కరింపులు, ఏవియో మధురతరంగాలు తన్నెచ్చటికో తేల్చిపోవ, ఒంటిగా ఆమె ఆరీతీగానే పవళించియున్నది.
౨ ( 2 )
వెఱ్ఱి తల్లి
ఇంతలో రుక్మిణికి బురుడువచ్చినది. నెలలు నిండినవని తోచుట తోడనే నారాయణరావు పరమేశ్వరమూర్తు లాలోచించుకొని రాజారావును రప్పించుకొనిరి. రాజారావు తానెరిగియున్న విద్యావంతురాలును నిపుణురాలు నగు యూరేషియను దాయి నేర్పరచినాడు. వారు చేయవలసిన విధులన్నియు నొనర్చి, శ్యామసుందరీదేవితో నవసరమయినపుడువచ్చి కనుగొనుచుండుడని చెప్పి తాను వెడలిపోయినాడు.
రుక్మిణి సుఖముగ నాడపిల్లను గన్నది. పరమేశ్వరుని మో మానంద ప్రఫులమైనది. ఈ బాలికయైన బ్రతికి బట్టకట్టిన తాను ధన్యుడే. తనకు శిశువు అన్న నెంత యానందమో యంత విషాదమును గూర్చినాడు విధి. ఈ బాలిక యైన బదికాలములు సుఖముగ బ్రతికినచో తన కంతియే చాలును.
‘ననూ పాలింపా, నడచి వచ్చితివో
- నా తల్లి _ ఉమా శిశూ _ ననూ...
వనజనయన, హిమ _ గిరి తనయ జననీ
- నీలశరీరద్యుతి నిండించీ విశ్వమెల్ల
అని పాడుకొన్నాడు. బాలిక యొడలు తొనలుకట్టి యున్నదట.
‘పరమేశ్వరం, నీకూతురు మలయమారుత రాగాన్ని ఏడుస్తూ ఉన్నదిరా! మంచి సంగీతపాటకురా లయ్యేటట్లున్నది. అచ్చంగా నీ పోలికే. వెళ్ళిచూడు, నక్షత్రం మంచిది, ఏమి దోషాలు లేవు’ అని నారాయణుడన్నాడు.
శారద బాలికను జూచి కిలకిలలాడినది.