ఈ పుట ఆమోదించబడ్డది

296

నా రా య ణ రా వు

భర్త తనకడకు రాకుండ తప్పిన జాలుననియే యామె కోరిక. భర్తకడకు తాను వెళ్ళినచో నాతడు తన్ను బ్రేమించుట మొదలిడినచో దానెట్లు బ్రతుకుట? వెల్సుకవి రచించిన ‘సౌహార్ద్రమగు స్నేహము’ అను నవల తాను చదివినది. అందులో నాయిక తన జీవితమును ప్రేమార్పితము చేసినది. పోనీ, తా నెవరినైన అట్లు ప్రేమించుచున్నదా? జగన్మోహనరావు బావను తాను ప్రేమించుట లేదు. అది నిశ్చయము. జగన్మోహనరావు బావ తన్నతిగాఢముగ బ్రేమించు చున్నాడని తనకు దెలియును. ప్రేమయన నేమి? పురుషుని జూచినను, తలచినను అతనిలో నైక్యమైపోవ గోరుటయేకదా! తానట్లెవరినైన ప్రేమించినదా? జగన్మోహనరావు బావపట్ల మంచి స్నేహమున్నది. అతనితో గంటల కొలది మాట్లాడ మనసగును. అతడు చెంతనున్నప్పుడు తన్ను సంతోషమున ముంచివేయును. తన తల్లిదండ్రులపట్ల తమ్మునిపట్ల మాత్రము తన కట్టి భావము లేదా? అంతకు మిక్కిలి తా నేపురుషుని ప్రేమించుట లేదు.

భర్త చదువుకొనినవాడు. మోటుమనిషి కాడు. తాను జూచినంతవరకు నొరులజోలికి బోవని కరుణార్ద్రహృదయుడు. అతని జూచినవారెల్ల మెచ్చు కొనుచున్నారు. అటువంటియప్పుడు తన కిష్టముగాని ప్రేమను అతడు గోరునా?

చిన్నతనమునుండియు దన్ను పెంచిన పుష్పవనము, గోదావరిగాలి తన కింక దూరమైపోవును. తన చిన్నతమ్ముడు ఇంక తన్ను విచిత్రములగు ప్రశ్నలు వేయడు. ఈ పరిచారికలు చుట్టములు వెనుకనే యుండిపోవుదురు. ఏమిటిది! చదువుకొన్నవా రిట్టుల బెంగ పెట్టుకొననగునా?

శారద అత్తవారింటికి వెళ్ళి పదిరోజులుమాత్రమే యున్నది. ఇంతలో చెన్నపురి వెళ్ళిపోవలసివచ్చినది. భర్త మొదటితరగతి జంటసీటుల పెట్టెలో తనతో ప్రయాణము చేసెను. వారన్న నందరకు ప్రేమయే! ప్రయాణములో ఎన్నో సౌకర్యములు! తన మనస్సేమియు నొవ్వని విధాన పువ్వులలో ప్రయాణము జరిగినది.

భర్త తన్ను జదువునకు బిలిచినాడని ఆడుబిడ్డ కబురు తెచ్చుటతోడనే, యామె హృదయము కలతనొందినది. ఆశ్చర్యమందినది. ఆమె నారాయణరావు కడకు సూర్యకాంతముతో వచ్చి మేడమీదగదిలో సూర్యకాంతము కుర్చీ ప్రక్కకుర్చీలో గూర్చుండిపోయినది. తన గంభీరమగు గొంతుకతో నారాయణరావు సర్వసౌందర్యసంపన్నయగు శారదకు పాఠములు ప్రారంభించినాడు.

ఎట్లుగడిచినదో యొక గంట, శారద పరవశురాలయిపోయినది. తన మధురకంఠముతో జ్ఞానము తేనెవాకలు కట్టునట్లు భర్త బోధించినప్పుడు శారద విభ్రాంతయైపోయి విన్నది. అంతయు జెప్పినవెనుక నాత డామెను ప్రశ్నలు వేసినాడు. మొదట చెప్పలేక డగ్గుత్తిక పడినది. కాని నెమ్మది నెమ్మదిగ భయముతీరి యన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినది.