ఈ పుట ఆమోదించబడ్డది

288

నా రా య ణ రా వు

నారాయణరావు మనస్సు సంకటపడునప్పుడెల్ల శ్యామసుందరిని కలసికొని యామెతో నన్నివిషయముల జర్చించుచు నానందమునొందును.

ఆడువారికి మగవారికి పవిత్రమగు స్నేహముండుట సహజమనియు, దానిని మనము అసహజమగు మన బ్రతుకులచే పంకిలమొనరించుకొనుచున్నామనియు, కావుననే నేడు పురుషులకును వనితలకును ప్రవిత్రస్నేహ ముండుటకు వీలులేకుండ నున్నదనియు నాతడు పరమేశ్వరునితో ననినాడు.

రష్యా దేశపు స్థితినిగూర్చి ప్రసంగము వచ్చినది. ‘నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏది అంటే బోల్షివిజమనే చెప్పాలి. ఆస్తి అందరికి సమము కావింపబడవలె. అంటే ఆస్తి అంతయు ప్రభుత్వముది. ప్రజలు తమతమ విధులు నిర్వర్తించాలి. వారి వారి పనులనుబట్టి జీతము టిక్కెట్ల రూపమున ఇవ్వాలి. ఆ టిక్కెట్లనుబట్టి నీకు కావలసిన వస్తువును తెచ్చుకొన వచ్చును. ఒకవేళ తిండి చాలదందువేమో, ప్రతిమానవునకు భోజనాదికముల మితి యేర్పరచవచ్చు’ నని నారాయణరా వన్నాడు.

పర: మనయంతట మనము ఉత్సాహము పుట్టి పనిచేయలేముగా! మనకు వచ్చే లబ్ధి భోజనముమాత్రమే. అంటే గొప్పగొప్ప కార్యములు చేయడానికి ప్రచోదనం ఏదీ?

నారా: ఎందుకు కలగదురా? ఏమమ్మా చెల్లీ! నువ్వు చెప్పు, ఈమధ్య బోల్షివిజము పుస్తకాలు చాలా చదివావు.

శ్యామ: ఉతృష్టకార్యాలు చేసేవాళ్ళకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తారు. పైగా ధనపూర్ణమైన ఇంగ్లండు మొదలైన దేశాలలో కూడా గొప్పగొప్ప శాస్త్రజ్ఞులు అద్భుతములు కనిపెట్టారంటే డబ్బుకోసమా? ఆ ఉత్సాహం వారిలో సహజం కాబట్టిన్నీ, పేరుకోసమున్ను. ఇప్పుడు రష్యాదేశానికి ఏమన్నా లోటు ఉన్నదా?.

నారా: బాగున్నదమ్మా.

పర: కాని శ్యామచెల్లీ! ఒకటి ఆలోచించు. ఏనాటికైనా బోల్షివిజము చనిపోతుందిసుమా. ఎవడిబాగు వాడు విచారించుకోవడమే మానవస్వభావం. కాబట్టి, నెమ్మది నెమ్మదిగా ధనం రహస్యంగా పోగుచేసుకుంటాడు. ఇప్పటికి రష్యాలో ఎన్ని కేసు లల్లాంటివి చూడడం లేదు?

శ్యామ: అదికాదు; ఒక వేళ ఆ గుణం సహజం అనుకున్నా, దేశంలో ఉన్న ఆస్తిఅంతా కలేసి పంచుకోడం మంచిది.

నారా: జాయింటు కుటుంబమల్లె.

పర: అబ్బా లాయరు! ప్రపంచం అంతా జాయింటు కుటుంబం చేస్తావా! బోల్షివిజము ఏ దేశానికి ఆ దేశానికే ఉంటే చాలా? లోకమంతా ఒక్కటే రాజ్యం చేయాలా?