౨౧ ( 21 )
ఇ ష్టా గో ష్టి
నారాయణరావు, పరమేశ్వరమూర్తి, శ్యామసుందరీదేవి, రోహిణీదేవి కవులకూటమినిగూర్చి సముద్రపుటొడ్డున మాట్లాడుకొన్నారు.
ఇప్పుడిప్పుడు వచ్చు యువకవులలో నింకను స్వాతంత్య్రము జూపువారున్నారు. మొత్తముమీద ఆంధ్రప్రదేశంలోని నేటి కవిత్వము ప్రేమతోనిండి నీరసత్వములోనికి దిగినదని యొక కళాభిజ్ఞుడు భారతిలో వరుసగా నాలుగు వ్యాసములు వ్రాసి యువకవుల నందరిని యెత్తిపొడిచినాడు. వేషములో నాడుతనము కనబడినట్టు కవిత్వములోను ఆడుతనమే కనబడుచున్నదట ఆయనకు. మొన్న జరిగిన కవుల కూటమివంటివి జరుగవలెననియే యభిప్రాయమట. కాని యీ యువకవులు తమచుట్టు వేనకువేలు విషయములుండ నీ సృష్టిలో నాడుదియు మగవాడును దక్క నింకేమియు లేనట్లు కవిత్వము వ్రాయుట ఉపజ్ఞాశూన్యతను బ్రకటించుచున్నదని యాయన వాదించినాడు.
నారాయణరావు ఆ కళాభిజ్ఞునితో నేకీభవించలేక పోయినాడు.
పరమేశ్వరు డా వాదమును ఖండించినాడు. ‘ప్రేమ యుత్కృష్టమగు విషయము. నీ ప్రియభామినిపై జూపించు ప్రేమ యీ జన్మలోనో మరికొన్ని వేల జన్మాలకో భగవంతునిపై ప్రేమగా మారుతుంది. లీలాశుకుడు చింతామణిపై ప్రేమచే మహాభక్తుడుగా మారి పరమభాగవతుడైనాడు.
నారాయణరావు శ్యామసుందరినిచూచి చిరునవ్వుతో ‘చెల్లీ! సృష్టి అంతా భగవంతుని స్వరూపం కద. అలాంటిది, కరుణాది రసాలచే మానవజీవనక్షాళన మొనరింపక ప్రేమ ప్రేమయని వెఱ్ఱిపద్యములు వ్రాయుట హృదయ దౌర్బల్యసూచకం గాదూ? నీ ప్రేమ గొప్పగా ఉండాలి. వ్రాయి! రెండు మూడు మహా ప్రేమనూక్తాలు. తక్కినవి తిండిలేక మాడు బీదవాళ్ళను గూర్చి, బానిసలకన్న అథమాథములుగ నున్న మాలవాళ్ళను గూర్చి మనుసులు కరిగేటట్లు కవిత్వం రచించు. మానవలోకాన్ని ఈశ్వరాభిముఖం చేసేదే కవిత్వం’ అని వాదించినాడు.
శ్యామసుందరి వారిరువురకు చక్కగ సమాధానము కుదిర్చినది. ‘ప్రేమ ప్రపంచములోని మహోత్తమ విషయం. అది ప్రాపంచికత్వానికి ఉత్తమ విషయం అయినట్లు కావ్యవిషయంలోనూ మహోత్తమము. తక్కినవి జీవితంలో స్త్రీ పురుష సంబంధం తర్వాత వస్తాయి. కావ్యంలోనూ అంతే. ఏ విషయం వ్రాసినా కావ్యంమాత్రం అయిఉండాలి. అవునా అన్నా, అవునా పరమేశ్వర్?’ అని నవ్వినది.