ఈ పుట ఆమోదించబడ్డది

క్లి ష్ట స మ స్య

285

రాజారావు అమలాపురం వెడలిపోయినాడు. పరమేశ్వరమూర్తి భార్య రుక్మిణి క్షేమముగ నున్నది. ఏది యెట్లయినను మంచిదని యామెకు సంపూర్ణారోగ్యము కలుగువరకు దనయింట నుండవలెననియు, పరమేశ్వరుడు తనయింట భోజనము చేయవలెననియు నారాయణరావు మిత్రుని బలవంతముజేసెను.

‘పర! జనవరి నుంచి శారదను గొనివచ్చి కాపురం పెడుతున్నాను.’

‘మంచిది మంచిది! చేయి యేది? నాకు సంతోషముగా ఉందిరా?’

నారాయణరావు శారదను బ్రేమించుచున్నంత గాఢముగ నారాయణు నామె ప్రేమించుట లేదనియు, తనమిత్రు డందులకై మిక్కుటముగ బాధ ననుభవించుచున్నాడనియు బరమేశ్వరుడు గ్రహించినాడు. తానుమాత్రము రుక్మిణి తన్ను ప్రేమించినంత దా నామెను ప్రేమించుచున్నాడా? పరమేశ్వరుడు తాను నిర్మలుడనని చెప్పలేడు. మనసెప్పడును బంకిలమగుచుండును. కొంచె మందమయిన వనిత కనబడినప్పుడెల్ల పరమేశ్వరుడు విచారముపొందును. ఆమెను భావనాలోకమున వివస్త్రజేసి యవయవములన్నియు మనోనేత్రముచే బరీక్షించుకొనును. ఆతడు శిల్పి.

రుక్మిణి కురూపి కానేకాదు, దివ్యసౌందర్యవతియు గాదు. ఒక్కొక్కప్పు డామె సౌందర్యము ఉత్తమముగ గన్పట్టును. భర్త కిసుమంత కోపము రానీయదు. సంసారము చేయుటలో కొద్దిలో కొండలు చూపగలదు. ఆమె పొదుపరి. కాని యనవసరమగు ఖర్చు చేయకుండుటలోనే యా పొదుపు. భర్త తెచ్చిన ధనములో షడ్రసోపేతమగు భోజనము, గృహాలంకారములు పోను ధనము మిగిల్చి, భర్త స్వంతఖర్చులకు బదిరూపాయలు నెలకిచ్చి, నెలకు బది, పదిహేను సేవింగ్సు బ్యాంకిలో ధనము నిలువచేయును.

భార్య యెదుట నున్నచో బరమేశ్వరుని కామెయే మనోజ్ఞానమూర్తి వలె గోచరించును. పరమేశ్వరు మోహము మహాలక్షుభిత సముద్రము వంటిది. అప్పు డాతని భార్య ఆనందములలో గరిగిపోయి యాతనిలో నైక్యమైపోవును.

రుక్మిణికి, సూర్యకాంతమునకు బ్రాణస్నేహము కుదిరినది.

‘వదినా! నీకు చిన్న పాపాయి పుట్టినప్పుడు నన్ను రోజూ యెత్తుకో నిస్తావా? నేనేమో నీళ్లుపోస్తా! ఉగ్గు పెట్టడం నా చేత కాదు. అక్కయ్యల పిల్లలని నేనే ఎప్పుడూ ఆడించేది. పరమేశ్వరం అన్నయ్యకీ, మా చిన్నన్నయ్యకీ చంటిబిడ్డలన్న అంత ప్రేమ యేమిటి వదినా?’

రుక్మిణికి రాబోవు ఆనందస్మృతి గన్నీరై ప్రవహింప, మోము ప్రఫుల్లమై వెలుగ, సూర్యకాంతమును దన హృదయమునకు హత్తుకొని యా బాల నుదురు ముద్దిడుకొన్నది.

పరమేశ్వరమూర్తి తన చుట్టములలో నిరువురు యువతులతో గొంచె మనుమానముపడవలసినరీతి సంచరించినట్లు తన భార్యకు తోచినది. అప్పడు రుక్మిణి పడిన బాధ వర్ణనాతీతము. పరమేశ్వరు డది గ్రహించినాడు. భార్య