ఈ పుట ఆమోదించబడ్డది

‘పిల్లలంటే ప్రాణం’

271

శ్యామ: జబ్బు చేస్తే నాకు తెలియపరచారు కాదే నారాయణరావుగారు కాని, పరమేశ్వరమూర్తిగారు కాని? పోనీ లెండి.

పర: క్షమించాలమ్మా దేవిగారు! మొన్న నేనూ, నారాయణరావు మూడుసారులు కాలేజీకి ఫోనులో మాట్లాడినాం. మీరింకా పెద్ద ఆస్పత్రినుండి రాలేదట. తర్వాత ఇంటికి కారు పంపాము. మీరు షికారుకు వెళ్ళారట. నిన్న రాజారావు రావడంవల్ల ఆ గడబిడలో ఉన్నాము.

శ్యామ: ఏమిటండీ జబ్బు?

రాజా: గర్భస్రావము అయినంత పని అయింది. ఇదివరకు మూడుసార్లు ఇంతే. ముందు రాకుండా ఉండడానికి వైబర్నం, అశోక, సిడాన్సు మొదలైనవి వాడుతున్నాను. మీరు కొంచెం చూస్తూఉంటారుగనుక భయం ఏమీ లేదు.

శ్యామసుందరీదేవి అయిదవసంవత్సరం ఎం. బి., బి. ఎస్. పరీక్ష చదువుచున్న దాయేడు. ‘పని ఆట్టే చేయించకుండా ఆమెకు కావలసినంత విశ్రాంతి ఇస్తూ, నే చెప్పిన మందును ఇస్తూఉంటే ఏమీ ఇబ్బంది లేదన్నాను. ఏమంటారు మీరు?’ అని రాజారా వనెను.

శ్యామ: అవునులెండి. తప్పకుండా చూస్తూ ఉంటాను. నా కిదివరకు ఎప్పుడూ చెప్పినారుకాదే పరమేశ్వరమూర్తి అన్నగారు?

రాజా: అతను సిగ్గుపడాడేమో?

శ్యామ: కాబోలు.

రోహిణీదేవి రెప్పవాల్చక పరమేశ్వరునివైపు జాలిచూపుల జూచుచు ‘అన్నగారికి చాలామంది పిల్లలు పోయారని విన్నాను. పాపం!’ అన్నది.

రాజా: ఇదివరకు ముగ్గురు కుమాళ్లు పుట్టి పోయినారు, ఇతనికి పిల్లలంటే ప్రాణం. మా నారాయణరావన్నా ఇతడన్నా పిల్లల్ని వదలరు! చంటిపిల్లా డయిపోతాడు పరమేశ్వరమూర్తి వాళ్ళతోపాటు.

రోహి: ఆయన హృదయం వెన్నవంటిదని మేమంతా అప్పుడే గ్రహించాము.

పర: నారాయణ హృదయం పన్నీరే!

రాజా: కాని అవసరం వస్తే ‘వజ్రా దపి కఠోరాణి’ అయిపోదటోయి? అతనూ నువ్వూ ఒకటే!

పర: అదా నాయనా, నువ్వు గ్రహించింది?

నట: అదిదా అడగండిమీ. ఏవిటిదా డాక్టరు చెప్పుదురూ! అవసరము వచ్చినప్పుడుదా మంచి గట్టిదని. అంతదా! ఏమిరా పరమేశ్వరమూర్తిగారూ అవళదానేనా?