ఈ పుట ఆమోదించబడ్డది

262

నా రా య ణ రా వు

‘కాని, ఒక తెలుపులోంచి అన్ని రంగులు వచ్చినట్లు, ఒక మహాస్వరం లోంచి అన్ని స్వరాలు రావడం లేదా అన్నా!’

‘అదిమాత్రం నిజం. అదే అఖండ శ్రుతిస్వరూపం సుమా!’

‘శ్రుతి చాలా చిత్రంకాదు అన్నా? మొన్న శ్రుతిలోనే అపశ్రుతి యిమిడిఉందన్నావు ఏమిటి?’

‘నాఅర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో అవ్యక్తమై, అనిర్వచనీయమైన పరబ్రహ్మ స్వరూపము తప్ప తక్కినవన్నీ ద్వంద్వాలేకాదూ! వెలుగు నీడ, మంచి చెడ్డ అలాగు. శ్రుతి అపశ్రుతికూడా అట్టి ద్వంద్వమే. శ్రుతిలో అపశ్రుతి సతతము గర్భితమయ్యే ఉన్నది. శ్రుతి ఉంచుకు వెడుతూఉంటే ఎక్కడ పడితే అక్కడ అపశ్రుతి రావచ్చు కాదూ చెల్లీ. సైకిలుఎక్కి పోయేవాడున్నాడు. వాడికి సమ్యక్‌స్థితి (బేలన్సు) ఉన్నది. ఎక్కడపడితే అక్కడ బేలన్సు తప్పిపోవడానికి వీలుందా లేదా! ఎక్కడనుంచివస్తున్నది ఆ అపశ్రుతి? శ్రుతిలోనుంచే! అలాగు వెలుగులోనుంచే నీడ!’

శ్యామసుందరీదేవి నారాయణరావుతో నిటుల గంటలతరబడి సంభాషించుచు, నాతని వదలజాలకుండును.

శ్యామసుందరీదేవి యింతవరకు నేరిని బ్రేమింపలేదు. ఆమె సుగుణఖని. ఆమె ప్రతి జాతీయోద్యమమునందు బాల్గొనుచుండును. ఆమె శ్రీమతి కమలా చటోపాధ్యాయికి స్నేహితురాలు. జాతీయవారములందు, గాంధీవారములందు ఖద్దరు, వాడవాడకు దిరిగి యమ్ముచుండును. స్వదేశవస్తువుల నమ్ముచుండును. గ్రామ గ్రామములకు శ్రీమతి ఆచంట రుక్మిణీదేవి మొదలగు దేశనాయికల యాజమాన్యమున దిరిగి, కల్లు త్రాగవద్దనియు, హిందూ మహమ్మదీయ సమ్మేళనమున్న గాని దేశమునకు స్వరాజ్యము రాదనియు బోధించుచుండెను.

శ్యామసుందరీదేవి తెలుగు బాగా మాట్లాడగలదు. తెలుగే యామె మాతృభాషయా యనిపించునట్లు మాట్లాడగలదు. ఆమె సగము కర్ణాటాంగన యయ్యు భారతీయ భాషలలో తెలుగే యత్తమమని వాదించును.

శ్యామసుందరి హృదయము పవిత్రమైనది. ఆమెకు పురుషు లనేకులతో స్నేహమున్నను మనస్సులో నిసుమంతయు వికారముకలుగదు. అంతరాంతరములనైన గోర్కి జనించనులేదు, తీగెలు సాగనులేదు.

అట్టి శ్యామసుందరి నారాయణరావన్న వెఱ్ఱిప్రేమలో మునిగినది. పవిత్రహృదయ యగుటచే నారాయణరావన్న నింత భ్రాతృప్రేమ కలుగుటకు కారణమేమని చర్చించుకున్నది. అతడు తన సోదరుడని దృఢనిశ్చయము చేసికొన్నది.

ఇదివర కే యువకుడూ ఆమెతో నొంటరిగానుండి మాట్లాడలేదు. అందులో పరుడగు యువకునితో నొంటిగా గంటలకొలది సంభాషించుట ఇంతవర కామె జన్మలో జరుగలేదు.