ఈ పుట ఆమోదించబడ్డది

౧౩ ( 13 )

మదరాసు కాపురము

నారాయణరావు చెన్నపట్టణమున గాపురము పెట్టినాడు. మైలాపురిలో మంచియిల్లద్దెకు దీసికొని, రెండువేల రూప్యములుపెట్టి న్యాయశాస్త్ర గ్రంథములు, హైకోర్టుతీర్పులు నాతడు కొనెను. ఇల్లంతయు బరమేశ్వరుని సహాయముతో నలంకరించెను. మామగారి యింటిలో నుండనని యాతడు దెలిపినాడు. సూర్యకాంతమును, పెత్తల్లి కుమార్తె బంగారమ్మను గూడ గొనివచ్చెను.

అడ్వకేటు నారాయణరావుగారు న్యాయవాదవృత్తి ప్రారంభించినారు. ఇంటిలో ముందు నారాయణుని కార్యాలయము. నాలుగు బీరువాలలో న్యాయశాస్త్ర గ్రంథము లున్నవి. ఖద్దరు రంగుదుప్పట్లు పరచిన బల్లలు, సోఫాలు, కుర్చీలు నున్నవి. మందిరమంతయు నీలధూసర వర్ణములచే నలంకరింపబడినది.

ప్రక్క గుమాస్తాగదియు, వెనుక రహస్యాలోచనపు గదియు నలంకరించినారు. ఆ వెనుక ఆడవారుండు స్థలమున్నది. దాని వెనుక విడిగా వంటయిల్లున్నది. వంటయింటిలోనికి బోవు మార్గమునకు, బైన గప్పును అమర్చినారు. నారాయణరావు న్యాయవాదవృత్తియందలి మెలకువలు నేర్చుకొనుటకు, వృత్తియందనుభవము సముపార్జించుటకు, నొక పెద్దవకీలుకడ జేరినాడు. నారాయణరావు బి. ఎల్. పరీక్షలో మొదటివాడుగా కృతార్థుడైన సంగతియు, తక్కిన పరీక్షలన్నిట మొదటివాడుగా జయమందిన సంగతియు నా వకీలునకు దెలియును. రెండుమూడు అప్పీళ్ళలో బనిచేయుమని చెప్పినప్పడు నారాయణరావు జయరామయ్యగారి హృదయమున నద్భుతము నిండునట్లు పనిచేసి, యాయన చేతికిచ్చినాడు. ఒక అప్పీలులో నాయనగూడ తెలిసికొనజాలని యొక విషయము పట్టుకొని అప్పీలు వాదమునకు బలము చేకూర్చినాడట. జయరామయ్య, ముందు ముందీ బాలుడు హైకోర్టులో ముఖ్య న్యాయవాదియై, న్యాయ సింహాసనముకూడ నధిష్ఠింపగలడని యనుకొనెను.

అన్నగారు శ్రీరామమూర్తి పంపిన చిన్న అప్పీళ్ళు రెండు తయారుచేసి దాఖలు చేసినాడు. న్యాయవాద ప్రముఖుడగు జయరామయ్యగారు తాను దగ్గర నుండి నారాయణరావు నొక చిన్న అప్పీలు వాదించుమన్నారు. నారాయణరావు బాగుగా నా యప్పీలు వాదించుటకు సిద్ధపడియే వచ్చియుండెను.

న్యాయమూర్తియు నీ బాలకుని వాదన యెట్లుండునో చూచెదముగాకయని, నారాయణరావునకు ననుమతి యొసంగెను. పదినిముషములలో నాచిన్న యప్పీలు, విషయనిర్ధారణచేసి. పరస్పర సంబంధము చూపి, విషయములను బలపరచు న్యాయశాస్త్రమున బూర్వపు దీర్పులనుజూపి, వాదము ముగించి