ఈ పుట ఆమోదించబడ్డది

234

నా రా య ణ రా వు

గరిటెలు, గడియారములు, వెన్న, జోళ్ళు, పెట్టెలు మొదలగు నన్ని రకములగు సామానులు పాశ్చాత్యదేశములతో సమానముగ నొనర్చుచున్నారు. ఏదేశమునకు వలయు వస్తువుల నాదేశమే చేసికొనవలయునను ధర్మమును దయాలుబాగు వారు మనకట్టెదుట కనబరచుచున్నారు. ‘అహో దయాలుబాగా! నీకు నమస్కారములమ్మా, సద్గురూ! నీకు జయమగు గాక!’ అన్నారు వారు. నారాయణరావును, బరమేశ్వరుడును దయాల్‌బాగులో నివసించి సద్గురువుగారి బోధనలు విని సంతసించి, వారి యాధ్యాత్మిక తత్వము భగవద్గీతాబోధతో సమానము మాత్రము కాదని నిశ్చయించుకొనిరి.


౯ ( 9 )

స్నేహితుల కాహ్వానము

రాజేశ్వరరావు బి. ఇ. పరీక్షలో నెట్లో కృతార్థుడై పని నేర్చుకొనుచున్నాడు. అతని ప్రాణమంతయు రాజమహేంద్రవరములో సుబ్బయ్యశాస్త్రి గారి యింటిలో నున్నది. ఒకసారి దక్షిణాదికి బోవలసివచ్చినది. ఒకసారి మలబారు తీరమునకు వెళ్ళినాడు. మొదటి సంఖ్యలో గృతార్థుడు కావలసిన యా యువకుడు, పరీక్షలో నెగ్గుటయే కష్టమైనది. ప్రభుత్వపు నౌకరీదొరకుట దుర్లభము. కావున హైదరాబాదు సంస్థానములోనో లేక జిల్లాబోర్డులోనో యుద్యోగము సముపార్జింప నాతని కోరిక.

ఆలం, రాజారావు మున్నగు మిత్రులు రాజేశ్వరుడు మకాము చేసిన వై. ఎం. సి. ఎ. లో జేరినారు. ఆలం బి. ఎల్. పరీక్ష నెగ్గినాడు, అప్రెంటిస్ పరీక్షలో జేరి అడ్వకేటయి చెన్నపురిలో గృతార్థుడగుటకు నారాయణరావు ఆలంను తనదగ్గర నుంచుకొని, కృషి చేయించినాడు. ఆలంకు నారాయణరా వన్న ప్రాణమే. అతనికి ‘బ్రాహ్మణతురక’ యని స్నేహితులందరు పేరిడిరి.

ఆలం బి. ఎల్. తరగతిలో జదువుచున్నప్పుడు ట్రిప్లికేనులో వర్తకము చేయు నెల్లూరు మహమ్మదీయ వర్తకుని కొమార్తెనిచ్చి వివాహము చేసినారు; వివాహము నెల్లూరులో జరిగినది. నిక్కా ఉత్సవమునకు మన మిత్ర బృందమంతయు విచ్చేసినారు. ఆంధ్ర తమిళ దేశములలో హిందూ మహమ్మదీయ సమస్య లేనేలేదు. మహమ్మదీయులు, హిందువులు సోదరులవలె మెలంగుదురు. మహమ్మదీయుల హృదయములలో వీర్యాగ్ని ప్రభుత్వమువారు అనేక రీతుల రగుల్కొల్పిరి గాని యది రాజినదికాదు. మహమ్మదీయులు హిందూ దేవాలయములను గౌరవించుచున్నారు. హిందువులు, మసీదులకడ వాయిద్యము వాయించరు. తెలుగుదేశముల మహమ్మదీయుల సోడాషాపులలో బ్రాహ్మణులుకూడ షర్బతులు త్రాగుదురు. కిళ్ళీలు కొందురు. మహమ్మదీయ యోగుల గోరీలకు బోయి హిందువులు పూజలు చేయించుచుందురు.