ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయుల ప్రాచీన నాగరికత

227

నకు కాలమే ప్రమాణము. గంగ మహావేగమున ప్రవహించును. యమున గంభీరముగా నెమ్మదిగా చరించును. లోతులేని గంగయు, లోతుగల యమునయు సంగమించినచోట నా యువకులిరువురు స్నానమాడి, ఊరు జూడబోయిరి. పండిత మోతీలాలుని భవనము, విశ్వవిద్యాలయములు, కోట, పురాతనాశ్వత్థ నారాయణము దర్శించినారు. కోటలోని యశోకుని స్థంభము గమనించినారు.

వారిరువురు ప్రయాగలో గంగను పెద్దబిందెలలో బట్టి రైలుమార్గమున రాజమహేంద్రవరము లక్ష్మీపతికి పంపినారు.

అలహాబాదు నుండి లక్నో, హరిద్వారము, హృషీకేశము దర్శించినారు. వియత్పథము వదలి గంగాదేవి హృషీకేశముకడ నార్యావర్తములోనికి కుడియడుగు పెట్టినది. అచటి ఋషుల యాశ్రమముల దర్శించినారు. రామతీర్థస్వామి గంగలో గలసిపోయిన ప్రదేశము చూచినారు. ఆ మహాభాగుని దలపోసికొని నారాయణరావు పరమేశ్వరుని జూచి ‘ఈ పరమఋషి, హిమాలయములో దిగంబరుడై సుమేరువు నధిగమించినాడురా! ఆ మహానుభావుడు రచించిన ఎన్నో గ్రంథాలు పోయాయి. దేశాలు తల్లడిల్లజేసి వివేకానందుని యాత్రను సంపూర్ణము చేసి యవతారం చాలించాడురా. ఏమి మేధావి! లెక్కల ఎం. ఎ. చిన్నతనంలో పది లెక్కలిచ్చి, ఎనిమిది చెయ్యమంటే, పదీ చేసేవాడు సగం కాలంలో.

‘సత్యస్వరూపుడగు పరమాత్మను కనుగొన్న ఆ మహానుభావునకు లెక్కలు గిక్కలూ ఒక లెక్కటరా నారాయణం?’

కతిపయ దినాలలో ఢిల్లీ చేరుకున్నారు. కుతుబుమినారు, అశోక చక్రవర్తి నాటిన ఇనుపకంబము, జుమ్మామసీదు చూచినారు. మహమ్మదీయ శిల్పచమత్కృతి గమనించినారు. క్రొత్తఢిల్లీలో తయారగు భవనములు చూచి ‘జీవములేని యీ కళాచమత్కృతి యీ కాలమునకు దగినట్లే యున్నది’ యను కొన్నారు. మ్లేచ్ఛచక్రవర్తులు ఢిల్లీ చుట్టున నున్న వివిధస్థలముల గట్టిన కోటలు, మహాభవనములు చూచినారు. అక్బరు కట్టిన ఫతేపూరుసిక్రీయును, ఫైజాబాదును, హుమయూను గోరీని మొదలగునవన్నియు జూచినారు. ఫతేపూరుసిక్రీలో రెండురోజులున్నారు. అక్బరు చక్రవర్తి, చరిత్రయంతయు దలపోసికొనినారు.

‘ఓరే నారాయుడూ! ఈ భవనములో దిరిగిన అనార్కలీ చరిత్ర మంతయు దలపుకు వచ్చుచున్నది. వివిధదేశాల నుండి వచ్చిన యప్సరస్సమానలగు సుందరీమణు లెందరీ మందిరాల తిరిగినారో? అస్పష్టమధురములయి వారి మాటలు పాటలు ప్రతిధ్వనిస్తున్నవిరా.’

‘కవిత్వం! కవిత్వం! నారాయణా! నువ్వొక సర్దారువు. నువ్వు దర్బారునకు వెళ్తూవుంటే జనానా మేడలమీద ఒక కిటికీలో నుంచి రెండు లేడికన్నులు నీవైపు చూశాయి. నువ్వూతలెత్తావు ఆలోచనాలు నవ్వినై...’