ఈ పుట ఆమోదించబడ్డది

శా ర ద

21

వెనుకను, శారదాంబాజమీందారిణిగారు బ్రతికినన్నాళ్ళు అహోరాత్రములు అన్ని వర్ణముల వారికి అన్న ప్రదానము గావించినారు. మాలమాదిగలకు వంటలు చేయించి పెట్టించినారు. ఎందరికో పెండ్లి పేరంటములు చేయించినారు. సంగీత సాహిత్య శాస్త్ర, వేదాది విద్యా పారంగతులకు వార్షికము లొసగి, సంభావించినారు. హైదరాబాదు సంస్థానములో వర్తకము చేసి, కోటికి పడగ నెత్తిన గంగరాజు సుజనరంజనరావుగారి కామె ఏక పుత్రిక. సుగుణసంపదయు ధనసంపదయు నామెలో గంగాయమునలవలె సంగమించినవి.

తండ్రిగారు వచ్చిరని తెలియుటతోడనే, శారదమోమున సంతోషము విఱియబార, తలలో తుఱుముకొనుటకు గోసికొన్న పూవులను సజ్జలో నిడికొని, విసవిస నడచి భవనములోనికి బోయినది. మేడమీద తనగదిలో నద్దముల యెదుట నిలుచుండి పూవుల నమరించుకొని, యా బాలిక నాయనగా రెక్కడ నున్నారో వెంకాయమ్మ నడిగి తెలిసికొని యచ్చటికి బోయినది.

జమీందారు గారు తాను చదువుకొను గదిలో సోఫాపై కూర్చుండి యున్నారు. శారద తల్లిగారు వరదకామేశ్వరీదేవియు నచ్చటనే దిండ్లకుర్చీలో కూర్చుండి భర్తతో మాట్లాడుచున్నది. జమీందారుగారి యక్క సుందరవర్ధనమ్మయు నచట నిలుచుండి ‘ఎందుకోయి, పిలిపించినావు?’ అని యడిగినది.

సుందరవర్ధనమ్మగారు విగతభర్తృక. హైకోర్టు న్యాయాధిపతిచేసి, లక్షలు సముపార్జించి, న్యాయధర్మములో ప్రఖ్యాతి వహించిన విశ్వనాథంగా రామెభర్త. వేదాంతజ్ఞానోపార్జనాసక్తి యామెకు మిక్కుటము. సంతతము ఆమె పట్టుబట్టలతోనే యుండును. ఆమె కుమారుడు తండ్రిబోలి చెన్నపట్టణములో న్యాయవాదవృత్తిలో పేరును, ధనమును వెనుక వేసికొనుచు దివ్యముగ కాలక్షేపము చేయుచున్నాడు. పుత్రునింట తన యాచారాదికములు సాగమి, ధర్మకర్మపరతంత్రుడగు నామెతమ్మునిఇంటనే యుండి, యాజమాన్యము వహించి, కాలక్షేప మొనర్చుచున్నది.

జమీం: చిన్నమ్మాయికి ఈరోజున పెళ్ళికొడుకు వస్తున్నాడు.

వర్ధనమ్మ, వరదకామేశ్వరి: ఎక్కడనుంచి, ఎవరు?

జమీం: కొత్తసంబంధం.

వర్ధనమ్మ: మన దేశమేనా? మన దేశములో ఇదివరకు మనం చూసి నచ్చవనుకున్న సంబంధాలేగా అన్నీ!

వరద: జమీందారీకుటుంబమేనా ?

జమీం: (నవ్వుచు) నన్ను చెప్పనివ్వండి మఱి. మన దేశమే. జమీందారీ కుటుంబంకాదు గాని పరువైన నియోగులు. చాలా సిరి సంపదా కల వాళ్లు. (భార్యవంక చూచుచూ) జమీందారులకు కూడా అప్పిచ్చేటంత నిల్వవుంది.