ఈ పుట ఆమోదించబడ్డది

నా కు ప్రే మ లే దు

217


రానున్న భయంకరమగు విపత్తు తప్పినట్లయినది. భర్త బలవంతము చేయునేమో యని యామె భయపడినది. కాని యాత డంత నెమ్మదిగ సంచరించుట చే నామెకు హృదయము నుండి పెద్ద బరువు తీసివేసినట్లయినది.

చదువు విషయమై ఎక్కుడు శ్రద్ధవహింప నారంభించినది. పూర్ణకంఠమున సంగీతము దివ్యకిన్నరస్వరముతో నర్తనసేయ, దనలోనే మోహమావరించి పోవ త్యాగరాజు భక్తిగీతములు మరియు నానందముగ బాడుకొనజొచ్చినది.

శకుంతల శారదను జూచి ఈసును, మెప్పునుట్టిపడ, ‘నీ వదృష్టవంతు రాలవే చెల్లీ! నీకు మహారాజ కొమార్తెలు కోరితే దొరకని మగడు దొరికాడే తల్లీ. పాడుకో! నాకంఠం ముక్కలయిపోయింది. మీ బావకూ నాకూ ఎప్పడూవచ్చే వాగ్వివాదంతో గొంతుకలో అపశ్రుతి వచ్చిందే. వీణ వాయించుకోవడమే లేదు. పిల్లలిద్దరూ ఎప్పుడూ అల్లరే.’

‘శారద తన యక్కగారి పిల్లలను సంతతము నాడించునది. ఈరోజులలో నా బంగారుతొనల బాలిక లిద్దరిని ఒక్కనిమిషము వదల లేదు.

•••

జమీందారుల యిండ్లలోని ఆడువారిట్టులే సంచరింతురా? లేక తనకు మాత్రమిట్లు జరిగినదా? సంగీతముపై మనస్సుపోలేదు. తమ తోటలోనికిబోయి చెట్లతో దనహృదయము విప్పుకొన్నాడు. చెట్టు చేమలను జేరబోయి ‘చూచినారా నా చెలిని’ అని యడిగిన కావ్యనాయకుల చేష్ట లాతనికి జ్ఞప్తికి దగిలి నవ్వువచ్చినది. గులాబులు, మల్లెలు, సంపెంగలు, లెజిస్ట్రోమియనులు, బోగెన్ విల్లాలు తన్ను జూచి కరుణ ఒలికించుచున్నట్లు తోచినది నారాయణరావుకు.

తండ్రిగారికి, మామగారికి, అన్నగారికి నారాయణరావు రాణ్మహేంద్రవరములో న్యాయవాదవృత్తి ప్రారంభింపవలెనని కోర్కె యున్నది. తాను అందుకు వల్లెయనవలెనని కుతూహలము నందినాడు. ఇప్పుడెట్లు? న్యాయవాద వృత్తి యెందులకు? శ్రీ గాంధీమహాత్ముడు మరల కాంగ్రెసును నడుపుచు ఖైదులకు బొండని యా దేశమిచ్చినను బాగుండును. సమస్తము విడిచి సన్యసించిన బాగుండునేమో? శ్మశానవైరాగ్యమా? తనలో వాంఛపోయినదా? ‘తలలు బోడులైన తలపులు బోడులా!’ ఏరీతినైన దేశసేవ చేయవలెను. ఏమియున్నది? గ్రంథాలయములా? ఇప్పుడు వానిరుచి పోయినది. ఖద్దరు ఉత్పత్తియా? ఓ ఫ్యాక్టరీ పెట్టుటయగును. ఆస్పత్రి పెట్టుదమన్న వైద్యవిద్యకు దూరమై పోయెను. రాజు అదృష్టవంతుడు. వాడు పరీక్షలన్నిట గృతార్థుడై మదరాసులో పెద్ద ఆసుపత్రిలో వృత్తి నేర్చుకొనుచున్నాడు.

పరమేశ్వరుని హృదయము మెత్తనిది. అతడు సంతోషజీవి. కష్టములున్నవని గుర్తింపలేడు. అంతము లేని యెడారివలె కన్పించు తన జీవిత మింక గడతేరుట యెట్లు?