ఈ పుట ఆమోదించబడ్డది

216

నా రా య ణ రా వు

సోఫాపై కూలబడినాడు. ఇక నేమున్నది? సర్వము ముగిసినది. అంతయు నల్లబడిపోయినది. ఆ ముక్కలే తనకు జన్మాంతరము దుఃఖితుడవు కమ్ము అని విధించిన శాపము. తాను కట్టుకొన్న దివ్యభవనము కూలిపోయినది. తన బ్రతుకు నిరర్ధక మైపోయినది.

• • •

నారాయణరావు రాపడిన గుండెతో లోతులేని నవ్వుతో గపటనాటక మాడుచు నత్తవారింటికడ, కొత్తపేటలో దనయింటికడ, తక్కిన యామిను లెట్టులో వేగించినాడు. మిత్రులకైన దెలియనీయలేదు. పునస్సంధాన మహోత్సవ మిట్లు ముగిసినది.

తనయింటికడ తండ్రి సత్యనారాయణవ్రతము సంకల్పించినారు. ఎటుల జరిగినదో, ఏమి జరిగినదో!

శారద పుట్టిల్లువచ్చి చేరినది. ఆమెకు దాను భర్త యెడజేసిన మహాపరాధము అవగతమైనది. తన తండ్రికిని, తన భర్తకును దోష మొనరించినాను అన్న భావము వ్యక్తావ్యక్తమై యామెకు దోచినది.

బాలకుడగు కేశవచంద్రుని హృదయమున నేదియో అనిష్టము జరిగినదన్న యాందోళన కలిగి పెద్దక్కగారికడకేగి ‘చిన్నబావ మంచివాడు పెద్దక్కా?’ యనెను. శకుంతల తమ్ము నెత్తుకొని, ముద్దుపెట్టుకొన, కేశవచంద్రుడు పెదవులు తుడుచుకొనుచు ‘పెద్దక్కా చిన్నబావ మంచివాడు కాడా’ యని ప్రశ్నించెను.

‘అయితే మీ పెద్దబావగారు మంచివారు కారన్న మాటేనా?’

‘కారు.’

‘ఎందుచేత?’

‘ఏమో!’

అతడు శారదకడకేగి చిన్నక్కగారి మోము తీక్ష్ణముగ నాలోకింపుచు,

‘చిన్నక్కా! మా చిన్నబావ దేవుడి అవతారముకాదూ! నిజంగా నేను నమ్ముతా’ నని యనెను.

శారద అతనిమాటల కులికిపడెను.

శకుంతల తన చెల్లెలిని జేరి ‘శారదా! మీ ఆయన చెన్నపట్టణం వచ్చేటప్పుడు మనఊరు వస్తారటే?’ యని యడిగినది. శారద తనకు తెలియదని నూచించినట్లు తలతిప్పినది.

శకుంతలకు మరదిపై ఆపేక్ష యినుమడించినది. నిర్మలహృదయముతో దల్లికడ, చెల్లెలికడ, మేనత్తకడ, తండ్రికడ నాతని పరిపరివిధముల బొగడ జొచ్చినది. శారదకు దన సహోదరి మాటలు కష్టములై యామెను జేరుటకు సందేహించుచు, వీలైన దప్పించుకొనుచు మెలగచొచ్చినది.