ఈ పుట ఆమోదించబడ్డది

208

నా రా య ణ రా వు

ముల నెరుంగక నశించిపోవుచుందురట. కాని చదువుకొను బాలలకు బ్రేమయన నేమియో తెలియును. వారి హృదయమున బ్రేమోదయము కాని యప్పడు వారెట్లు వివాహము చేసికొందురు? ప్రేమ కుదిరినచో నా పురుషునకు వారు సర్వస్వము ధారవోయుదురట.

ఈ విషయములన్నియు నా బాలికలు చర్చించుకొన్నారు. తనకు వివాహమైనది. తాను భర్తను బ్రేమించుటలేదే! తన కుటుంబము వేరు. తన భర్తకుటుంబము తన తండ్రిగారికడ సేవకావృత్తి చేసికొనవలసిన పల్లెటూరి కుటుంబము. చదువున్ననేమి? వారికి దర్జాలేదు. క్రిస్టియనులు మొదలగువారు చదువుకొనుట లేదా! ఇక బలమగు దేహమా! అది కూలివాండ్ర కందరకు నుండును. ఆ సంగతే తన మేనబావయగు రాజా జగన్మోహనరావు తనతో వేసారులు చెప్పియున్నాడు.

జగన్మోహనుని గౌరవము, అతనిదర్జా, ఠీవి తన యత్తవారి కెట్లువచ్చును? తాను జగన్మోహనుని ప్రేమించుచున్నదా? తాను చెప్పలేదు. తన్ను జగన్మోహనరావుబావ ప్రేమించుచున్నాడు. అతనికి ప్రేమించుట తెలియును. తక్కువజాతి వారికి ప్రేమించుట యెట్లుతెలియును? తాను జగన్మోహనుని ప్రేమించినది, లేనిది ప్రస్తుతము తనకు తెలియకపోయినను, తన భర్తను ప్రేమించుట లేదన్న మాట మాత్రము నిశ్చయము.

నెలలు గడిచినవి. ఇంటరు పరీక్షాగ్రంథములు చదివించు నమెరికా వనితామణి తనకు బాఠములు చెప్పు సందర్భమున జమీందారులు, ప్రభువులు నమెరికా దేశములలో లేరనియు, ఈ దినమున బాకీపనిచేయు పురుషుడు రేపు అమెరికా దేశాధ్యక్షుడు కావచ్చుననియు, గావుననే జమీందారులన్న పదమే తన దేశములో నుపయోగింపరనియు జెప్పినది.

అప్పుడు శారద కా ఉపాధ్యాయినియెడ కోపమువచ్చినది. కానీ భర్తయన్న నసహ్యము పోలేదు. తనకు పునస్సంధాన మహోత్సవన్నమాట వినబడినతోడనే యామె గజగజ వణకిపోయినది. తన కక్కరలేదని తల్లి దగ్గర కంటనీరు పెట్టుకొన్నది. తల్లి జమీందారు గారి కడకుబోయి ‘అమ్మాయి కిప్పుడు కార్యముచేయుట నాకిష్టము లేదండి’ యని యన్నది.

‘ఎందుచేత?’

‘అదియింకా చిన్న పిల్ల.’

‘పదహారో ఏడు జరుగుతూంది. పద్దెనిమిదేళ్ళవరకు ఉంచడం బాగానే ఉంటుంది. కాని దాని యత్తవారు పూర్వకాలపురకం. వియ్యంకుడుగారు కోరుతూ ఉత్తరము వ్రాశారు. వారిమాట కాదనలేక సరే అంటూ ఉత్తరం వ్రాశా.’

‘అల్లాంటి చాదస్తపు పూర్వకాలపు సంబంధం యెందుకు చేశారు?’