ఈ పుట ఆమోదించబడ్డది

204

నా రా య ణ రా వు


అప్సరస్సమూహమువలె అలంకరించుకొని వనితాబృందమంతయు నా మందిరము చేరవచ్చెను. భార్యాభర్తలచే దంపతులకు తాంబూలమును రవికల గుడ్డలు పళ్లు దక్షిణలు నిప్పించిరి.

నారాయణరావు హాసప్రఫుల్లవదనముతో, మెరుపు లీను కన్నులతో భార్యకు నత్తరువు నలందినాడు, గంధము పూసినాడు, తాంబూలము కొనపంట గొరికి యిచ్చినాడు. మదనసుందరుడగు నారాయణరా వప్పుడు ప్రణయమున మరియు సుందరసుభగత్వపూర్ణుడై ప్రకాశింప, వదిన గారు శకుంతలా దేవి చెల్లెలి భర్తను జూచి యిత డింత యందగాడా యనుకొన్నది. ఆమెకు తన పునస్సంధానము జ్ఞప్తికి వచ్చినది. నారాయణరావు చూపుల హావభావవిలాసములు తనభర్త జూపలేదు. ఏమిది! ఈతనివంటి వాడు తనవారిలో నెక్కడ, నెవ్వరు లేడుగదాయని మురియుచు నామె తనమరిది నేదేని వ్యాజమున ముట్టు కొనుచు, నాతనిచే తన చెల్లెలికి నత్తరు వలందచేసినది. చెల్లెలిచే నతని కలందించినది. తాంబూలము లిప్పించినది. సూర్యకాంతము జానకమ్మగారు మొదలగువా రానందమున నోలలాడినారు. జమీందారుగారి చుట్టపు సుందరీమణులు, నారాయణరావు చుట్టు మూగిపోయినా రావేళ.

శారదకు చైతన్యము లేదు. ఆమె వదనాన నలముకొన్న విచారతమస్సును నారాయణుని తను మనఃప్రభాజ్యోత్స్నలుకూడ పారద్రోలలేదు.

బాలికలు కిన్నరీ కంఠముల పాటలు పాడినారు. శారదమాత్ర మెంత వేడినను పాటపాడినదిగాదు. వియ్యాలవారి పాటలు, శ్రీరాధికాకృష్ణగీతములు పాడినారు కొందరు బాలలు. రాత్రి రెండవయామము దాటునప్పటికి తలుపులుమూసి, అందరును వెడలిపోయినారు. శకుంతల శారద నావలి కొకసారి తీసికొనివెళ్ళినది.

నారాయణరా వరగంటవరకు హృదయము గబగబ కొట్టుకొనుచుండ మంచమునుండి దిగి యొక సోఫాపై కనుపెట్టికొని యున్నాడు. తన చిన్నారి భార్యకు మనస్సెటులున్నదో యని యూహించుకొన్నాడు. అతనిని తేనెతీపు లావరించుకొని పోవుచున్నవి.

ముప్పాతిక గంటయైనది. ఇంకను వధువు లోనికి రాలేదు.

నారాయణరావు లేచినాడు. గదిలోని యలంకారములు తిరిగి చూచినాడు. కాని యాతని దృక్కులకు శారదావిగ్రహముతప్ప నేమియు గాను పించలేదు. శారద సర్వాభరణభూషితురాలై యున్నది. ఆ బాలకు నా దివ్య మోహనమూర్తికీ నలంకారములేల! సాయంసమయముననే కోసిన గులాబీ పూవులతో నామె శిరోజములు కప్పివైచిరి. కట్టిన చీర ఎంత విలువగలదైన శారదాసౌందర్యముమ్రోల నగలతో బాటు వెలవెలలాడిపోయినది అనుకొన్నాడు. ఆమెను ముట్టినప్పుడెల్ల పులకరింపులు, మలయమారుతమునకు పుష్పభరితమాలతీలత జలదరించినట్టు అతని నావరించుకొన్నవి.