ఈ పుట ఆమోదించబడ్డది

194

నా రా య ణ రా వు


ఆ సాయంకాలము జగన్మోహనుడు శారదకడకు జేరి ‘శారదా! తోటలోకి షికారువెడదాము, రా!’ అని అడిగెను. ఆరోజు పున్నమ. ఆశ్వయుజ పూర్ణిమ ఆనందకల్లోలిని. నీలములు ధవళములునగు శారదాజ్యోత్స్నలు మీగడతరకలై, మధురషీరతరంగములై యుబికిపోవును.

శారద వల్లెయని తోటలోనికి బయలుదేరినది. ఆ బాలకు యౌవనము నానాటికి పూవునకు దావివలె జేరుచున్నది. ఆమెను సౌందర్యము వెన్నెలవలె నావరించియున్నది.

పూవుతోటలోని సౌరభము, దిశల నావరించియున్న పండు వెన్నెలలు శారదాసౌందర్యములో లీనమైపోయినవి.

శారదను శలభమును చూచు గౌళివలే జగన్మోహనుడు తేరిపార చూచుచు, వెనుక నడచుచు నా బాలిక నొక వేదికకడకు గొనిపోయెను. సుగంధములగు వేడినీళ్ళ స్నానమాచరించి, పాముకుబుసమువంటి గ్లాస్గోమల్లు పంచగట్టి, అట్టి లాల్చీయేతొడిగి, ‘కూటికూర’ పొడి దేహమెల్ల నలది ఘమ ఘమమనుచు, జరీపూవు బుటేదారిపనిచేసిన ముఖమల్ పాదరక్షలు ధరించి తెల్లనిదేహము వెన్నెలలో తళుకులాడ, ప్రక్కనే నడచు జగన్మోహనుని జూచుచు శారద ముగ్ధురాలై పోయినది. జగన్మోహను డామెకు నవమన్మథుని వలె కన్పట్టినాడు. ఆ బాలకుని బెండ్లి చేసికొనియుండిన నెంత చక్కగా నుండెడిదో అని ఆమె నిట్టూర్పుపుచ్చినది. చిన్నతనమునుండియు దా నాతనినే ప్రేమించినానని యామె యప్పుడనుకొన్నది. ‘ప్రేమించుట’ యను విషయ మామెకు నవలలవలన తెలియునుగదా. ప్రతిబాలికయు నెవరినేని పురుషుని ప్రేమించునుగదా . ప్రేమలేని పురుషుని బెండ్లిచేసికొనినచో నామె గతియెట్లు? తన తండ్రిగారట్టి ప్రేమకు దన్నెడసేసి వేరొకరికిచ్చి వివాహమొనరించుట తన దురదృష్టముగదా! తాను జదివిన పెక్కు నవలలలో కథానాయకులకు నాయికనిచ్చి వివాహముచేయక తల్లిదండ్రులందరు నిట్లే యితరుల కిచ్చుటకు బ్రయత్నించినారు.

‘శారదా! ఏమిటీ ఆలోచిస్తున్నావు? ఇదివరకు నీరక్తం ప్రవహించడమే పైకి కనబడుతుంది అనుకున్నాను. ఇప్పుడు నీ ఆలోచనలుకూడా కనిపిస్తున్నాయి ప్రియా!’

‘ఏమి లేదు బావా!’

‘శారదా! నీ అందం నా అందం కలిసిపోతే ఎంత బాగుండును! నేను నీభర్త నైయుంటే రోజూ నీపాదాలదగ్గర కూచుని నిన్ను ప్రేమిస్తూఉందును.’

శారద మాట్లాడలేదు కాని యామె హృదయము జగన్మోహను డన్న మాటకు సంతోషముచే బొంగిపోయినది.