ఈ పుట ఆమోదించబడ్డది

190

నా రా య ణ రా వు

రూపాయిలిస్తాను బహుమతి నీకు. నీ పైఅధికారి నిన్ను కోపపడినా రాని కోపం, నీ చేతిలో ఉండి నీకు దాసివలే వంగి ఉన్న భార్య పైన ఎందుకు వస్తుంది? అధికారి పైన వచ్చినకోపం అంతా ఏమయింది? అది మనము అణచి వేసుకుంటాము, చంపివేస్తాము. ఆ శక్తే మనం, మనకింద వాళ్లపట్ల కూడా ఎందుకు చూపకూడదు? యుగ పురుషుడు గాంధీమహాత్ముడు, క్రైస్తు, బుద్ధుడు మనకు బోధచేసింది. ప్రేమకాదా బావా? మనం కోపం చంపుకుని ప్రేమ చూపించడంవలన మనలను నమ్ముకున్న వారు జన్మజన్మకు మనయం దపరిమిత కృతజ్ఞత చూపిస్తారు. ఒకరియెడ ద్వేషంపూని వారిని హింసిస్తూ తక్కిన యావన్మంది విషయంలో ఎంత ప్రేమచూపినా, అది క్రోధస్వరూపము, అసత్యమూ అవుతుంది సుమా! క్రోధం రావడం, మనలో పశుత్వం ఇంకా చావలేదనేదానికి సూచన. నీకన్న చదువు రాని యానాదివాడు గొప్పే!

‘నేను ఉపన్యాసం ఇస్తున్నాను అని అనుకుంటావేమో? ప్రపంచంలో అందరికీ ఇలాంటి విషయాన్ని గురించే నేను ఉపన్యాసం ఇవ్వాలసివస్తుందా బావా?

‘బావా! నన్ను బాగా ఎరుగుదువుగదా? మామయ్యగారూ, అత్తయ్యగారూ ఈ విషయంలోనే నీతో కలహం పెట్టుకున్నారు. మా వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. నీమనస్సుమట్టుకు నీకు బాగుందా? నేను చిన్నవాణ్ణే! అయితే నీకూ నాకూ ఉన్న చనువునుబట్టి చెప్పాను.

‘ఆడది ఎల్లాగా దెబ్బలు పడుతుంది. ఎదిరించలేదు. అది పతివ్రతలకు ధర్మం. సహజం. కాని, వాళ్ళూ మన తోటివాళ్ళు అని ఆలోచించాలి. నేను నిన్ను వేడుకొనేదింతే.’

౨౨ ( 22 )

నాదీ భారం

బావమరిది మాటలు విన్నకొలదీ వీరభద్రరావుకు కోపము, నా వెనుక లజ్జయు, నా వెనుక విషాదము కలిగినది. అతడు మారుమాటాడలేదు. అతని కన్నుల నీరు తిరిగినది. ఇంతలో గోపమువచ్చినది. మరల నాపుకొన్నాడు. తానిచ్చిన యుపన్యాసమునకు బావగారికి గోపమువచ్చునని నారాయణరా వనుకొన్నాడు. అందుకై యేమి చెప్పవలయునా యని యాత డాలోచించుచుండెను.

లోపల సత్యవతి యేది యెట్లగునో యని లోన గజగజ వణకిపోవుచు, సత్వరముగ వంటచేసెను. బావమరదు లిరువురు కాళ్లుకడిగికొని భోజనముల ముందు గూర్చుండిరి. వీరభద్రరావునకు భోజనము సహించలేదు. నారాయణరా వది చూచి ‘బావా! నువ్వు సంతోషముగా భోజనము చెయ్యి. లేకపోతే నాకు అన్నం వంటపట్టదు’ అనెను.