ఈ పుట ఆమోదించబడ్డది

బ హు మ తి

179


భర్త మోటుగా నున్నాడనియు రాక్షసియనియు జగన్మోహనుడు తన్ను గూర్చి జాలిపడుటవలన శారదకు భయ మంకురించినది. భర్త బాగా చదివిన నేమిలాభ మని జగన్మోహనరావు బావ అన్నాడు. దివ్యారోగ్యసంపన్నుడగు నారాయణుని విమల హరిద్రారుణవర్ణము, వెలవెలబోవు జగన్మోహనుని యనారోగ్యపు దెలుపు బసిమిముందర నలుపేయని యామె యనుకొన్నది. దశమినా డందరును గలసి భోజనశాలలో బట్టుబట్టలు ధరించి కూర్చుండినప్పుడు, సుబ్బారాయుడుగారు పచ్చనివాడయ్యు జమీందారుగారు, విశ్వేశ్వరరావు, సుందరరావు, జగన్మోహనరావుల ముందర నల్లనివానివలె గనబడెను. నారాయణరావు లక్ష్మీపతులు నీగ్రోలవలెనున్నారని తనతల్లి పెదవివిరుపుతో దనకు జూపించినది. భర్త బరంపురం వంగపండుచాయ పెద్ద జరీరుద్రాక్షఅంచుల తాపితాలు కట్టుకొని, విశాలవక్షముతో, విశాలఫాలముతో వట్రువలుదిరిగిన దేహసంపదతో, విజ్ఞానము, ధైర్యము, బలము, శాంతము వెదజల్లు తీక్షణములగు చూపులతో స్ఫుటములైన కనుముక్కుతీరుతో ప్రద్యుమ్నునివలె నున్నట్లు ఆమె హృదయాంత రాళము విశ్వసించినను, తల్లిమాటలచే నా విశ్వాస మడగిపోవుచున్నది.

ఆ రోజున తాంబూలములు వేయునప్పుడు శారదను బిలిచి, తండ్రి యాపూట శ్రీరామయ్యగారితో గలసి జంత్రగాత్రముల నైపుణ్యము జూపుమని కోరెను. వీరందరికి నేను సంగీతము వినిపించవలయును గాబోలు ననుకొని తండ్రితో ‘నాన్నగారూ నా కేమి యివ్వాళ పాడాలని లేదండీ’ యనెను.

తన యిరువురు కుమార్తెలను కుమారుని జమీందారుగా రత్యంతము ప్రేమించినారు. వారు కోరునది కొండమీద కోతినైనను దెచ్చినారు. ఆ మువ్వురు బిడ్డలకు దండ్రియన్న భయము, గాఢ ప్రేమయు. తండ్రికి సంతోషము గలుగజేయవలెననియే ప్రయత్నంచెదరు. తండ్రి తెల్లబోయినట్లు కనిపించగనే శారద ‘సరేలెండి నాన్నగారు తప్పకుండా పాడ్తాను’ అని తండ్రియొడిలో తలనిడి కంటనీరు పెట్టుకున్నది. తండ్రి యామె నుదురు ముద్దిడుకొన బైకెత్తి నపుడు శారద దల నెత్తనిచ్చినదికాదు. జమీందారుగారు ‘సరేలే అమ్మా’ యని కొంచె మనుమానపడి, తలయెత్తి కంటనీరు తుడిచికొన్నట్లుండుటచూచి, యేమదియని చిన్న బుచ్చుకొని ‘పోనీ అమ్మా నీకు బాగాలేకపోతేవద్దు, కచ్చేరీ వద్దు. ఇంకొకసారిలే’ యన్నారు.

శారద చెంగున యచ్చటనుండి పారిపోయినది. ఏమది? తన ముద్దుల కుమార్తె యట్లు కంటనీరు పెట్టుకున్నది?

నారాయణరావు తన చిన్నారి పొన్నారి ప్రేయసికై పండుగ బహుమతి పట్టుకొని వచ్చినాడు, బంగారపు గొలుసులో ఆణిముత్యములు, నాయకమణి యైన గోమేధికపతకము మిలమిలలాడుచున్నవి. ఆ హారము వెల పదునెనిమిది