ఈ పుట ఆమోదించబడ్డది

178

నా రా య ణ రా వు

నిచ్చారు. అవన్నీ కడలూరులో తీసివేశారు. మళ్ళీ అక్కడ దెబ్బలాట; మళ్ళీ కొన్ని యిచ్చారు. ఇంతట్లో ఆరునెలలూ అయ్యాయి, నేనూ బయటకువచ్చాను.’

‘ఎల్లాగన్నా చాలా కష్టం అండీ, మీ రెల్లా ఉన్నారో! నాకు ఈ సహాయనిరాకరణం వృథా అని దృఢమైన నమ్మకం ఉంది. మీరు ప్రభుత్వము వాళ్ళిచ్చినవి పరిపాలిస్తూ ఎక్కువ కావలెనని గడబిడ చేస్తూవుంటే, నెమ్మది నెమ్మదిగా అవే వస్తాయి. స్వరాజ్యమూ వస్తుంది.’

‘అభిప్రాయాలు వేరులెండి. వానినిగురించి తేల్చుకోవాలంటే తెమలదు.’

‘వీరి సంభాషణ అంతా జమీందారుగారు నిశ్శబ్దముగానుండి వినుచుండిరి. జైలునుగూర్చి నారాయణరావు చెప్పుచున్నప్పు డాయన కళ్లు చెమర్చినవి. ఆ పరిసరములనే కూర్చుండి వినుచున్న సుబ్బారాయుడుగారు డగ్గుత్తికలు మింగినారు. విశ్వేశ్వరరావుగారికిని తోడల్లుని యసహాయశూరత ఆశ్చర్యము గొలిపి, వానిపై కొంత గౌరవము నావిర్భవింపచేసినది.

విశ్వేశ్వరరావుగారికి అసహాయవాదులు కాలము వృథాజేయు పిచ్చివారని యనిపించినది.

నారాయణరావు వీరుడని జమీందారుగారనుకొన్నారు. తానిట్టిపుత్రుని కన్నందుకు జన్మము సఫలమైనదని సుబ్బారాయుడుగారు హృదయమున రహస్యముగా నుప్పొంగిపోయినారు.

తన్ను హేళనజేయుటకు సంగతులు తెలిసికొనుటకుగూడ తోడల్లు డట్లడిగినాడని నారాయణరావు గ్రహించుకొన్నాడు. నారాయణరావు నిష్కల్మష హృదయముతో సత్యమునే సతతము వాక్రుచ్చు స్వభావము కలవాడు. నిజము చెప్పు మానవుడు ప్రపంచమున మానవులలోకెల్ల బలవంతుడని యాతడు వాదించును.

అతనికి మామగారి హృదయము గోచరించినది. తండ్రిగారి హృదయము తెలియవచ్చినది. అల్పమానవునివలె తానుచేసిన యల్పకృత్యముల జెప్పుకొంటి నేమోయని నారాయణరావునకు లజ్జ జనించినది. కాని యాతడు తన హృదయమును దరచి తరచి చూచుకొన్నాడు. దోషములేదని సమాధానపడినాడు. చీకట్లు క్రమముగ నావరించినవి.

౧౯ ( 19 )

బ హు మ తి

శారద తన యత్త గారికడకే పోవునదికాదు. జానకమ్మగారు, తన వియ్యపురాలు తనతో మాట్లాడకపోవుటయు, దన తోడలు కూడ తమ గదుల లోనికి రాకుండుటయు, దన వియ్యాలవారి చుట్టములు ముభావముగా మాట్లాడుటయూ జూచినది. కాని సుందరవర్ధనమ్మగారు మాత్రము వేయికన్నుల జానకమ్మగారికి నామె కుమార్తెలకు మర్యాద కేమియు లోటు లేకుండ జరిపించుచుండెను.