ఈ పుట ఆమోదించబడ్డది

కే శ వ చం ద్ర రా వు

149


‘చిన్నక్కా! ఇవ్వాళ నా కుక్క మొన్న మనం చూసిన సర్కసులో కుక్క కన్న బాగా మొగ్గవేసిందే!’

‘ఏమోయి చిన్నబావా! నువ్వు సర్కసు పెట్తావా యేమిటి?’

‘పెద్ద సర్కసు పెట్తాను. మా నాన్నగారికి గుఱ్ఱాలున్నాయా! రెండు ఏనుగులు మూడు సింహాలు కొంటాను ...?’

‘ఎంతపెట్టి కొంటావు తమ్ముడూ?’

‘నూరు రూపాయలు... కాదు, లక్ష రూపాయలు పెట్టి కొంటాను.’


౧౨ ( 12 )

కేశవచంద్రరావు


శ్రీ కుమారరాజా కేశవచంద్రరావు శారద తర్వాత ముగ్గురు పుట్టి పోయిన వెనుక జనించినాడు. ఆడపిల్లలవంటి యందముగల బాలకుడు. పనసతొనలవలె వెన్నముద్దవలె మెత్తని బొద్దైన అవయవములుగల బంగారుబాబు. అల్లారుముద్దుగా పెరిగినాడు. పెద్దక్క పైకన్న చిన్నక్కపై నాతనికి బ్రీతి ఎక్కుడు. తల్లి వరదకామేశ్వరీదేవి చేయు గారాబము విపరీతము. నేలపై అడుగుపెట్టనీయ దామె. అస్తమానము డాక్టర్లకు కబురులపై కబురులు; ఆ బాలుడు చిఱ్ఱున జీదరాదు. కొంచెము దేహము వెచ్చబడినచో నిదురబోవదు, వరదకామేశ్వరీదేవి ప్రాణము లన్నియు నా బాలకునిమీదనే యుండును.

తండ్రిగారు కుమారునిజూచుకొని యానందముతో మునిగిపోవుచుందురు. ఆయన బిడ్డలను దరికి చేరదీసి ముద్దులాడుట తక్కువ. ఒక్కొక్కప్పుడు, ప్రేమవివశులై ఏకాంతమున, బిడ్డలనట్టే బిగియార కవుగిలించుకొని, తనివార మూర్ధాఘ్రాణ మొనర్చుటయు కలదు.

కేశవచంద్రరావు మాటలు ముద్దుల మూటలే. ఆ బాలకుడు కొందరన్న దరికి జేరును, గొందరన్న దగ్గరకు రానేరాడు. అతనికి నారాయణరావుపై శారద పెండ్లిచూపులకు వచ్చిననాటినుండియు బ్రేమ జనించినది. పెండ్లిలో బావగారి నొక్క నిమేషము వదలియుండలేదు. నారాయణరావు తన బావ మరదిని దగ్గరకు తీసికొని యాతడడుగు విపరీతపు బ్రశ్నల కోపికగా జవాబులు చెప్పచుండువాడు. చిన్న చిన్న కథలు చెప్పువాడు.

నారాయణరా వెప్పుడు వచ్చిన నప్పుడు కేశవచంద్రుడు దగ్గరకు జేరుట జమీందారునకు పరమహర్ష కారణమైనది. కాని వరదకామేశ్వరీదేవికి బొమముడి తెప్పించినది. ఆ బండచేతులలో బిల్లవాడు నలిగిపోవునేమోయని యామెకు భయము కలిగెను. ఆ బాలకునితో రహస్యముగా దల్లి, నారాయణరావు బండవాడనియు అస్తమాన మాతని కడకు వెళ్లవద్దనియు, నాతని బండతనమే యా బాలకుని కంటుకొనుననియు జెప్పినది.