ఈ పుట ఆమోదించబడ్డది

జపాను

115

‘రామచంద్రగారు! అమెరికా దేశ ప్రజలు విచిత్రభావములు కలవారు. స్వతంత్రతకై ప్రయత్నించు ప్రజలకు జయము గోరుదురు. జయము గాంచినచో మిక్కిలి సంతసించెదరు. కాని ఫిలిప్పైనుదీవులను వారు వదలరు. వారి క్రైస్తవ మతము సర్వ దేశముల వ్యాపింప కోట్లకొలది డాలర్లు ఖర్చుచేసెదరు. తమ దేశస్తులకు క్రీస్తు ఉపదేశవాక్యముల నేర్పుటకైనను రాగిడబ్బు ఖర్చుచేయరు. తాము ఆంగ్లదేశముపై శఠించి విడిపోయి స్వతంత్రత సముపార్జించుకొన్నారు. హిందూదేశము స్వతంత్రతకై సర్వస్వము ధారపోయుచుండ, క్రైస్తు అవతారమనదగు మహాత్ముని గూర్చియు, హిందూదేశమును గూర్చియు నీలి వార్తలు ప్రకటించెదరు. కాని ఎన్ని చెప్పినను చదువుకొన్న ప్రతి అమెరికనునకు హిందూదేశము మాయాసంపూర్ణము, సర్వమతజనని, సర్వకళాశ్రయము, సర్వాద్భుతనిలయము. ప్రతిహిందువుడు కవి, వేదాంతి, భక్తుడు. ఊహా ప్రపంచ సంచారి. కాబట్టియే, ప్రతి ఏట అనేకులు అమెరికనులు హిందూదేశ యాత్ర గావించెదరు. కోట్లకొలది ధనము ఖర్చు చేసెదరు. క్రిందటి సంవత్సరము నుండియే నేను, మా అమ్మాయి ఆసియాను దర్శించ ప్రారంభించినాము. అదివర కమెరికాఖండములలోని దేశము లొకవత్సరము, యూరోపియను దేశము లొకవత్సరము చూచినాము.’

లియొనారాకన్య తల్లి ఇటాలియను. అప్పటికే ప్రసిద్ధికెక్కి, సంపూర్ణ యౌవనములోనున్న డాక్టరు రౌనాల్డుసన్ గారికడ చికిత్స బడయుట కామె విచ్చేసినప్పుడు వైద్యుడు రోగియు ఒకరినొకరు ప్రేమించుకొన్నారు. మ్యారియానా, కౌంట్ గ్యాలెటీ ఫెబియానో గారి కుమార్తె. తండ్రి ఇటలీదేశము తరఫున రాయబారియై వాషింగ్టన్ పట్టణములో నున్నప్పుడు బాలిక యగు మ్యారియానాప్రభుకుమారికి హృదయరోగము సంభవించి హృదయరోగ చికిత్సాదక్షుడగు రౌనాల్డుసన్ గారి వైద్యమునకై గొనిపోబడినది. దేహసంబంధ మగు హృదయరోగమును మాన్పి, మనస్సంబంధమగు కామరోగమును గల్పించినాడు ధన్వంతరి రౌనాల్డుసన్. తమ కుమార్తెను అపరిమితముగ బ్రేమించు ఫేబియానో బ్రభుదంపతులు తుదకు వారిరువురి వివాహమునకు సమ్మతింపవలసి వచ్చినది.

ఆ రౌనాల్డుసన్ దంపతుల గర్భమున చంద్రకిరణమువలె లియోనారా జనించినది.

లియోనారా స్వప్నకుమారి. మధుర మధురముగ సంగీతము పాడగలదు. లాటినుదేశస్తుల బ్రునెటీ (నల్లజుట్టు కలవారు) యందము, నార్డుజాతివారి స్వర్ణకేశసంపద, నిర్మలనీలదృష్టి, స్నిగ్ధశరీర ధావళ్యము నామెలో బ్రతిఫలించి, లియొనారాను అమెరికా బాలికలలో ఆనాటి అందగత్తెలలో రాణిని జేసినవి, ఆధ్యాత్మికానుభవ విషయములన్నియు నామె హృదయమును చలింపజేయును. హిందూదేశము, చీనా, జపాను, బర్మా, జావా, బలి, సింహళ దేశముల