ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికాయాత్ర

109

వారిలో గొలదిమందియే భాగ్యవంతులు. రంగూన్, మోల్ మేన్ మొదలగు ప్రదేశములలో నెక్కువగాను, దక్కిన దేశమునం దచ్చటచ్చట చాలదక్కువ గాను, ఆంధ్రులు బర్మాదేశమునకు వలసపోయినారు. సముద్రములుదాటి, దూర దేశములకు వర్తక మొనర్చుటకు, మత ప్రచారమునకు, రాజ్యస్థాపనకు పోయిన తొల్లిటి మనయాంధ్రుల సాహసోత్సాహముల దలంచుకొని, నేటిమనభీరుత్వమును అలసతను, పురుషార్ధ శూన్యతను చూచుకొన్నచో సిగ్గగునుగదా! నేటికిని పొట్టలు చేత బట్టుకొని బర్మా, నేటాలు, మలేద్వీపము, అస్సాములకు బోవుచున్న కూలీలుతక్క మనలో పురుషకారపరులు కానరారు. బర్మాలో తెలంగులను నొక జాతి వారున్నారట. వారేపల్లవుల కాలములోనో, చాళుక్యుల కాలములోనో, లేక కాకతీయుల కాలములోనో ఆ సువర్ణ ద్వీపము జేరియుందురు. తన పదియవ యేటనే ఆంధ్రులచరిత్ర చదివి వినిపించుకొనియున్న పుల్లంరెడ్డిగారు, రామచంద్రరావు సాహసమున కెంతయు మెచ్చుకొనిరి. రెడ్డిగారు నలువదియవ యేట చదువను వ్రాయను నేర్చుకొన్నారు. అయినను తనకు భారతరామాయణాదులగు పూర్వకాలపు టాంధ్రగ్రంథములను, ఆంధ్రులచరిత్ర మొదలగు నూతనయుగపు గ్రంథములను జదివి వినిపించుటకు విద్యాధికు నొకని నేర్పరచుకొన్నారు.

వెంకటరత్నం నాయుడు గారు మొదలగు మువ్వురు ముఖ్యులచే రెడ్డిగారికి నుత్తరములు వ్రాయించి పుచ్చుకొని, తన బావమరది బాలకుడనియు, నాతనికి వలయు సహాయమొనర్చి తన కుటుంబపు కృతజ్ఞతకు బాత్రులు గావలయుననియు వ్రాయుచు గమ్మలన్నియు నారాయణరావు రెడ్డిగారికి బంపించెను. రంగూనులో నుండి వార్తాపత్రిక నెలకొల్పి యనేక విధముల నాంధ్రులకు సహాయ మొనరించు ఆవటపల్లి నారాయణరావు గారికిగూడ నారాయణరా వుత్తరములు వ్రాయించినాడు.

రెడ్డిగారివలన, నమృతచందువలన, నారాయణరావుగారివలన పెక్కు విధములగు సలహాలనొంది రామచంద్రరావు జపాను వెళ్ళినాడు. టోకియో, యోకొహామా మొదలగు నగరములు, ధ్యానబుద్ధుని, ఫ్యూజియామాపర్వతమును రామచంద్రరావు దర్శించెను. జపాను విశ్వవిద్యాలయములను రసవిహారి బోసు గారి సహాయమున దర్శించెను. బోసుగా రనేక పరిశ్రమాగారములనుగూడ జూచుటకు సౌకర్యములు సమకూర్చినారు. బొమ్మలు, కాగితములు, గ్లాసు సామానులు, కత్తులు, సూదులు మొదలగు లోహపుసరుకులు, బొత్తాములు, పూసలు, దువ్వెనలు, వస్త్రములు, రబ్బరు సరుకులు, మందులు, నింక నెన్నియో వస్తువులను జపానుదేశము భారతదేశమున కెగుమతి జేయుచున్నది. ఆ కర్మాగారములలో బెక్కింటిని రామచంద్రరావు కనుగొనెను.

హిందూదేశము తన్నావరించిన దౌర్భాగ్యపిశాచమును వదల్చుకొని మరల సర్వతోముఖముగ నెప్పటికి విజృంభించగలదో యని రామచంద్రరావు