ఈ పుట ఆమోదించబడ్డది

అ మె రి కా యా త్ర

107

అని అనుకునేవి నేడు నాజూకువి అయ్యాయి. మనవాళ్లు స్త్రీ, పురుష సంబంధ విషయములయిన చర్యలన్నీ వెల్లడిగా ఉంచారా లేదా!’

‘అదేగా నేను పనికిరాదు అనేది!’

‘ఉండవోయ్! కాని ఇప్పుడింగ్లీషువాళ్ళు ఆడవాళ్ళ మోకాళ్ళపైకి గౌన్లు తొడిగి వక్షోజములు సగం కనపడేటట్టుగా కట్టి తిరగడము, బట్ట ఉందా లేదా అన్నట్లుగా లంగోటీలు కట్టి మగవాళ్ళతో ఈత లీదడము, ఈ రకముగా ఉన్నారు. వాళ్ళనుబట్టి మన వాళ్లుకూడా దుస్తులు అనుకరిస్తున్నారు. కాని అటువంటి దుస్తులు ధరించిన ఆడవాళ్ళను కౌగలించుకొని వందలకొలది జట్టులుగా నాట్యమాడుతూ తిరిగే పురుషులు, స్త్రీలదగ్గిర స్త్రీ రహస్య విషయాల్ని సూచనగా నైనా అనకూడదు. డాక్టర్లుమాత్రం వచ్చి రహస్యాలు మాట్లాడవచ్చును. మొగవాళ్ళే పురుళ్ళు బోయవచ్చును. మనవాళ్లో? కాస్త ఒళ్లు కనబడితే సిగ్గు లేని రట్టుమనిషి అంటారు. ఆడ డాక్టర్లు తప్ప ఎవ్వరూ రహస్యభాగాలు పరీక్ష చేయగూడదు. విడిగా మగవానితో ఉండకూడదు. స్నానాలకుకూడా గోదావరిలో పురుషులుండ గూడదు. కాని సమర్తలని గర్భాదానాలని ఉత్సవాలు చేస్తారు. ఇదంతా నీ దృష్టిపథంలో ఉంది. ఒకటి మొరకుతనం, ఒకటి నాజూకుతనం అని వాటి నుదుటిమీద రాసిలేదోయి శ్రీనివాసు!’

‘అలాగా?’

౨ ( 2 )

అమెరికాయాత్ర

రామచంద్రరావు జపాను చేరుకున్నాడు. జపాను దేశములో నొక నెల యాగి, యాదేశమునందున్న వింతలన్నియు దిలకించి, యానందించి మఱి యమెరికా వెళ్ళవలెనని సంకల్పము. రంగూనులో నుండగానే అతడు జపాను వెళ్ళుటకు, అమెరికా వెళ్లుటకు నారాయణరావు చేసిన కృషి వల్ల ‘అనుమతి పత్రములు’ రంగూనులోనున్న ఆంధ్రులలో గొప్ప షాహుకారగు పుల్లంరెడ్డిగా రిప్పించినారు.

రామచంద్రరావు తండ్రి భీమరాజుగారి స్నేహితుడగు అమరచందు గిరిధారిలాలను గుజరాతీ వర్తకుడు రామచంద్రరా వోడ దిగుటతోడనే యెదుర్కొని యాతని తనఇంటికి తీసికొనిపోయెను. గిరిధారిలాలుకు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాను, ఫ్రాంసు, ఇటలీ, ఇంగ్లండు, రష్యా, చీనా మొదలగు దేశములతో వర్తకసంబంధ మున్నది. అతడు వివిధ దేశములకు జాలసారులు ప్రయాణము చేసియున్నాడు. కాబట్టి ఆయన మనస్సులో రామచంద్రుని వెనుకకు బొమ్మని చెప్పుట కిష్టము లేకుండెను. అయినను మిత్రునియాదేశము చొప్పన రామచంద్రుని జూచి భోజనమైన వెనుక నిట్లనెను.