ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కావ్యాలంకారసంగ్రహము


గమలాప్తుఁ డీప్రోడ గాఁబోలుఁ గాకున్న, నధిగతమండలవ్యాప్తి గలదె
కమలజుం డీస్వామి గాఁబోలుఁ గాకున్నఁ, జతురాననవచఃప్రశస్తి గలదె


తే.

యనుచుఁ గొనియాడుదురు నిన్ను నంగవంగ, మాళ వాసంతి గౌళ నేపాళ చోళ
కుకురు కురు పాండ్య శక ముఖక్షోణిపతులు, నరనుతాటోప యోబయనరసభూప.

181

కావ్యలింగము —

క.

హేతువు వాక్యార్థం బై , యాతతవిస్ఫూర్తితోఁ బదార్థంబును నై
ఖ్యాతిఁ గనఁ గావ్యలింగం, బై తగు సత్కృతులయందు నది యె ట్లన్నన్.

182

వాక్యార్థహేతుకము —

మ.

అరుదై పొల్పగుపోచిరాజునరసింహా యన్న యష్టాక్షరీ
వరమంత్రం బది యెల్లకాలము నరు ల్వాక్రువ్వ సిద్ధించుఁ బో
కరు లాందోళిక లశ్వము ల్విభవము ల్గ్రామంబు లత్యుజ్జ్వలాం
బరము ల్సొమ్ములు పల్లకీ ల్పరిణయప్రారంభసంరంభముల్.

183

పదార్థహేతుకము —

క.

గురునఖదళితప్రతిమా, కరిచిత్రితభిత్తిగళితఘనమణివీక్షా
పరితోషయుతము లై నీ, యరిపురములఁ గినుక మాను హరులు నృసింహా.

184

అర్థాంతరన్యాసము —

తే.

మహివిశేషంబుచేత సామాన్యమును బ్ర, సక్తసామాన్యమున విశేషము సమర్థి
తముగ నర్థాంతరన్యాస మమరుచుండు, నెలమి రెండువిధంబు లైయ ట్లటన్న.

185

విశేషసమర్థితసామాన్యార్ధాంతరన్యాసము —

క.

విమలాత్ముఁ డెచట నుండిన, విమలుం డగు నె ట్లఁటన్న వినుము సురాగా
రమునఁ జరించియు నీయశ, మమలస్థితి గాదె యోబయబ్రభునరసా.

186

సామాన్యసమర్థితవిశేషార్థాంతరన్యాసము —

చ.

జలనిధిరాజకన్య కనుసన్న మెలంగుచు నుండువాణియున్
మెలఁగును మాటలోన నెలమిం జెయిసన్నఁ జరించుఁ గీర్తి నీ
లలితభుజోపగూహననివాసము మానదు ధాత్రి సద్గుణో
జ్జ్వలనరసింహ మంత్రబలవంతుల కింతులు చిక్కు టబ్రమే.

187

యథాసంఖ్యము —

క.

సమముగ నేవరుసఁ బదా, ర్థము లుద్దిష్టంబు లయ్యెఁ దగ నాపర్యా
యమున ననూద్దిష్టము లై, యమర యథాసంఖ్య మయ్యె నది యె ట్లన్నన్.

188


చ.

వరకరుణాధరాభరణవైభవసద్గుణబుద్ధిచాతురీ
పరమవిభుత్వపావనవిభాబలధైర్యవిజృంభణంబులన్
వరుస హరిం గిరిం గలశవార్నిధి గిర్నీధి శూలిఁ గీలి నా
కరిఁ గిరి గెల్తు వౌర త్రిజగన్నుత శ్రీనరసింహభూవరా.

189