ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము. ఆ. 4

67

విపరీతధీప్రదము —

క.

జగతి న్విరుద్ధ మతికర, మగునది విపరీతధీప్రదాఖ్యం బనఁగా
దగుఁ గృతు లన కులహీనుం, డగు నీతఁ డన నంబికావిటాసక్తుఁ డనన్.

19

ఆవిమృష్టవిధేయము —

క.

అవిమృష్టవిధేయం బగుఁ, దవిలినవర్ణ్యాంశ మప్రధానం బైనన్
నవనవసంఫుల్లలతాం, తవసంతము వచ్చె నిపుడు ధరణి కనంగన్.

20

పరుషము —

క.

శ్రుతికటువు లైనపదములు, కృతిఁ బరుషము లనఁగఁ జెలఁగు నిలఁ గుధ్రేడ్జా
పతిమూర్ధధృతార్థోడ్వధి, పతి గొల్తు నభీష్టసిద్ధి ఫలమున కనఁగన్.

21

వాక్యదోషములు —

సీ.

అక్రంబు విసంధి ప్రక్రమభంగంబు, పునరుక్తియుత మసంపూర్ణతరము
వాక్యసంకీర్ణంబు వ్యాకీర్ణ మధికప, దంబు వాచ్యవిసర్జితం బరీతి
న్యూనోపమంబు బధికోపమంబు సమాప్త, పునరాత్తమస్థానఘనసమాస
మనియతచ్ఛందంబు యతిభంగ ముపతత్ప్ర, కర్షంబు భిన్నలింగంబు భిన్న


తే.

వచన మక్రియసంబంధవర్జితములు, వాక్యగర్భితమును నన వాక్యదోష
వితతు లిరువదిరెం డయి వినుతిఁ గాంచు, వీని లక్షణలక్ష్యము ల్విస్తరింతు.

22

అక్రమము —

క.

క్రమహీన మక్రమం బగు, సమధిక మగు నితనికీర్తి శౌర్యచ్ఛాయా
సముదయమునకున్ దినకర, హిమకరకిరణోత్కరంబు లెనయే యనఁగన్.

23

విసంధి —

క.

అపగతలక్షణమును గ్రా, మ్యపుసంధియుఁ దగ విసంధి యనఁ దగు నరిగె
న్నపరగిరి కినుఁ డనంగా, నృపు లొప్పుదు రధికగుణవినిద్ర తనంగన్.

24

ప్రక్రమభంగము —

ఆ.

ప్రక్రమంబు విడువఁ బ్రక్రమభంగంబు, శౌరి దానవారిఁ జక్రధారి
నభవు నమితవిభవు ననవిద్యచారిత్రు, విష్ణుఁ గొల్తు జిష్ణుఁ గృష్ణు ననఁగ.

25

పునరుక్తియుతము —

క.

ఎనయఁగ శబ్దార్ధంబులు, పునరుక్తము లైన నదియె పునరుక్తియుతం
బనఁదగుఁ జక్రాంచలమున, దనుజావళిఁ ద్రుంచు జక్రధరుఁ డితఁ డనఁగన్.

26

అపూర్ణము —

క.

ధరలోఁ గ్రియాన్వయంబుల, సరిపోని దపూర్ణ మనఁగ సన్నుతి కెక్కున్
నరపతి యొసఁగును ద్రవ్యము, పరఁగఁగ నౌదార్యశాలి బహుళము ననఁగన్.

27