ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నరసభూపాలీయము

కావ్యాలంకారసంగ్రహము - చతుర్థాశ్వాసము



కరగభీరగుణర
త్నాకరకటకాధిరాజహయపతిసేనా
భీకర భుజప్రతాప
స్వీకృతజయసాంద్ర నారసింహనరేంద్రా.

1


తే.

అవధరింపుము దోషంబులను వచింతు, నవియు శబ్దార్ధగతము లై ద్వివిధము లగు
నందుఁ బదవాక్యగతము లౌ నరయ శబ్ద, దోషములు వీనిలోఁ బదదోషతతులు.

2


సీ.

అప్రయుక్తం బపుష్టార్థంబు నేయార్థ, మసమర్థకంబు నిరర్థకంబు
గ్రామ్యంబు విగతసంస్కారంబు గూఢార్థ, మన్యార్ధ మశ్లీల మప్రతీత
మప్రయోజనము క్లిష్టార్థబంధంబు సం, దిగ్ధంబు విపరీతధీప్రదాయి
యనిమృష్టతరవిధేయాంశంబు పరుషంబు, ననఁగఁ గావ్యంబులం దరసి చూడ


తే.

పదగతంబులు వెలయుసప్తదశసంఖ్య, గడలుకొన వీనిలక్ష్యలక్షణము లెల్ల
విస్తరించెదఁ గవితాప్రవీణసుకవి, నివహనిరతోపకారనిర్ణిద్రఫణితి.

3


క.

ఈకవితాదోషోత్కర, మేకడ నీ వొసఁగుమాడ్తి, నియ్యక ఖలు లౌ
నాకుఱకుఱదాతలకు మ, హాకుకవు లొనర్చుకృతులయందు వసించున్.

4

అప్రయుక్తము —

క.

కవులు ప్రయోగింపనిపద, మవనిం దగ నప్రయుక్త మగు నె ట్లన్నన్
ద్రవిణైలబిలుం డల దు, శ్చ్యవనమహాభోగిఖేటసంస్తుతుఁ డనఁగన్.

5

అపుష్టార్థము —

క.

ఎనయఁ బ్రకృతోపయోగం, బునుఁ జెందక యున్నపద మపుష్టార్థం బోఁ
దునిమెను వింశత్యర్ధా, ననువింశత్యర్ధరథునినందనుఁ డనఁగన్.

6

నేయార్థము —

క.

ఇలఁ దనసంకేతంబున నిలిపినపద మెంచి చూడ నేయార్థం బౌ
బలుతేనెదిండిగమి నగు, నలసాగరకర్ణయాన యలక లనంగన్.

7