ఈ పుట ఆమోదించబడ్డది

యెఱింగి యతనిచేత బుద్ధి చెప్పించవచ్చుననుకొని వాని యింట బసచేయుమని నానకును వేడుకొనెను. నానకు రాయబులారు నిమిత్తమే యక్కడికి వచ్చినందున వానియింటికి బోవుట కేయాటంకము జెప్పక కదలిపోయెను. పోయి యా మహాత్ముడు వార్ధకముచేత గదల లేకయున్న రాయబులారునుగాంచి వానిపాదములను దనహస్తముతో స్పృశించెను. ఆశతవృద్ధు మలినములగు తన పాదములను బవిత్రుడగు గురువు స్పృశించి నందుకు నొచ్చుకొని లేవలేక కూర్చుండియే నతని శిరస్సు మహనీయుడగు నానకు నడుగులం జేర్చెను. గురువు వృద్ధుని శిరస్సు సగౌరవముగా నెత్తి సేమమడిగెను. ప్రియబాషణంబులతో నిరువురు గొంతసేపు గడపిన పిదప నానకు బంధువులు వంట బ్రాహ్మణుని నొక్కని కుదిర్చి నానకు నిమిత్తము వంట జేయించిరి. కాళుడు ద్రిప్తాదేవి యాదినమంతయు రాయబులారు గృహమందే పడియుండిరి. వారు తనయింటివద్ద భృత్యులవలె నేలపడియుండిరో యాకారణము రాయబులారు చక్కగా నెఱిగి తానె ముందుగ నామాట కదపక వారి నోటనుండియే వారికోరికలు జెప్ప దలచి ప్రసంగింప జొచ్చెను. ఆతడు సంభాషణమారంభించి నాలుగు పలుకులు పలికినతోడనే ద్రిప్తాదేవి కన్నుల నీరుపెట్టుకొని తద్దయు దు:ఖితయై రాయబులారు హృదయము కరిగి పోవునట్లు వగచుచు వాని నిట్లు ప్రార్థించెను. "ఈకష్టకాలమందు