పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

హైద్రాబాదులాంటి పెద్ద నగరాల్లో ఏటేట పుస్తక మహోత్సవాలు జరుగుతున్నా యంటే వాటికున్న ఆదరణను గుర్తించవచ్చు. పోయిన పాతికేండ్లలోనే పుస్తక ప్రచురణం రెండంతలుగా పెరిగిపోయింది. పాఠకులు గొప్ప పుస్తకాలను ఎన్నుకొని చదవాలి.

మార్టిమేర్ ఆడ్లర్ గొప్ప పుస్తకాలకు ఆరు లక్షణాలు వుంటాయని చెప్పాడు.

1. గొప్ప గ్రంథాలను ఎక్కువమంది చదువుతారు. అవి చిరకాలం నిలుస్తాయి. గ్రీకుకవి హోమరు వ్రాసిన ఇలియడ్ గ్రంథాన్ని రెండున్నర కోట్లమంది చదివి వుంటారు.

2. గొప్ప గ్రంథాలు సామాన్య ప్రజల అవసరాలనూ కోర్కెలనూ తీర్చేవిగా వుంటాయి. అవి పండితులు మాత్రమే కాక మామూలు జనంకూడ ఇష్టంతో చదివేవిగా వుంటాయి.

3. గొప్ప పుస్తకాలు ఎల్లప్పడూ సమకాలికంగానే వుంటాయి. అవి నరుల ముఖ్యసమస్యలను ఎత్తుకుంటాయి. ఈ సమస్యలు ఎల్లదేశాల్లోను ఎల్లకాలం ఒకేవిధంగా వుంటాయి. కనుక ఈ పుస్తకాలు పాతవైనా నిత్యనూతనంగా వుంటాయి.

4. గొప్ప గ్రంథాలు మంచి ఉపదేశం అందిస్తాయి. అవిచేసే బోధలను అంగీకరించినా, అంగీకరించక పోయినా, మనం మాత్రం లోతుగా ఆలోచిస్తాం. అవి జనానికి ఆలోచన నేర్పుతాయి.

5. గొప్ప పుస్తకాల్లో హృదయాన్ని కదిలించే గొప్ప భావాలు వుంటాయి. ఈ భావాలు మామూలు పుస్తకాల్లో ఇంత ఉన్నత సంఖ్యలోను, ఉన్నత శ్రేణిలోను దొరకవు.

6. లోకంలో మరణం, శ్రమలు, మంచివాళ్లు ఓడిపోవడం మొదలైన గడ్డ సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం కనుగొనడం సులభం కాదు. గొప్ప పుస్తకాలు, ఈ చిక్కుసమస్యలను ఎత్తుకొని వాటికి పరిష్కారం చూపిస్తాయి. కనుక మనం వాటిని ఆసక్తితో చదువుతాం.