ఈ పుట ఆమోదించబడ్డది

నలోదయం


చెల్లీ, ఏదైనా ఒక మంచికథ చెప్పమన్నావు. విను, ఇదో చక్కని కథ. చాలకాలం క్రిందట మనదేశంలో నిషధ దేశమనే రాజ్యముండేది. ఆ దేశానికి రాజు వీరసేనుడు. అతని పరిపాలనలో ప్రజలు చీకు చింతలు లేక నిత్య సుఖులై హాయిగా ఉండేవారు. ఆ మహారాజుకి తగినట్టుగానే అతని కుమారుడు నలుడనేవాడు చిన్నప్పుడే సకల విద్యలు సాంగో పాంగముగా నేర్చి, సాటివారిలో మేటియై ఇటు తండ్రికి అటు ప్రజలకి కూడ ఆశాంకురమై, అల్లారుముద్దుగా పెరిగి పెద్దవాడయేడు. తగిన వయస్సురాగానే నలుడు తన తండ్రిగారి సింహాసన మధిరోహించి, ప్రజాభీష్టమెరిగి, మంత్రి సామంతుల సలహాలు మన్నించి రాజ్యం చేయసాగేడు.

అదే సమయంలో విదర్భదేశాన్ని భీమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అన్ని విధాలా అతడు అదృష్ట వంతుడే, కాని సంతానం మాత్రం కలుగలేదు. అందుచేత ఆ మహారాజు చాలా పరితపించి, ఎన్నో వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞయాగాలు చేసేడు. చివరకు దమన మునీశ్వరుని దయవలన అతనికి సంతాన ప్రాప్తికి వలసిన మంత్రం లభించింది. ఆ మంత్రోపాసనవలన భీమసేనునికి దముడు, దాంతుడు, దమనుడు అనే రత్నాలవంటి