ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ప్రస్తావన

శ్లో. యత్సత్యవ్రతభంగభీరుమనసా యత్నేన మందీకృతం
    యద్విస్మర్తుమపీహితం శమవతా శాంతిం కులస్వేచ్ఛతా,
    తద్వ్యుత్తారణిసంభృతం నృపసుతాకేశాంబరాకర్షణైః
    క్రోధ్రజ్యోతిరిదం మహత్కురువనే యౌధిష్ఠిరం జృంభతే.
                                            -భట్టనారాయణమహాకవి; వేణీసంహారము.

బ్రహ్మశ్రీయుతులును, దేశభక్తులును అగు ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారు వ్రాసిన "నాయకురాలు" అను నీ చిన్ని నాటకమును చదివినంతనే పైసూక్తి నాకు జ్ఞాపకమువచ్చినది. కేవలము జ్ఞాపకమువచ్చుటమాత్రమేకాక , ఈ నాయకురాలియందలి ఇతివృత్తముకూడ సర్వవిధముల కౌరవ - పాండవుల దాయభాగమున కైన పోరాటముతో తులదూగుచున్నది. పైగా నాటక రచయితలు రచనామధ్యమున వెల్లడిసేయించిన వాక్యములును నీ యర్థమునకు చక్కని యుపష్టంభకములుగా నున్నవి.

కథామూలము

నాయకురా లను నీ చిన్నినాటకమునకు అసలు ఆకరము పల్నాటివీరచరిత్రము. దీనిని ద్విపదలో ఆంధ్రకవిసార్వభౌముఁడని ప్రఖ్యాతిగాంచిన శ్రీ నాథమహాకవి రచించె నని లోకమున ప్రతీతి గలదు. శ్రీనాథకవిసార్వభౌముఁడు సుప్రసిద్ధుఁడై ఆంధ్రులగు ప్రతివారి హృదయములందును నిప్పటికిని యశఃకాయముతో తేజరిల్లుచున్నాడు . పంతులుగా రీ గ్రంథములోని అత్యల్పమగు కథాభాగ